పార్లమెంట్ లోనే లైంగిక వేధింపులు.. ఆస్ట్రేలియా ఎంపీ

ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్‌ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదని ఓ మహిళా ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ వేదికగా తాను లైంగిక దాడికి గురయ్యానని, ఈ పార్లమెంట్‌ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సెనెట్‌ సభలో ప్రసంగిస్తూ స్వతంత్ర సెనెటర్‌ లిడియా థోర్ప్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే తన తోటి సెనెటర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బుధవారమే పేర్కొన్నప్పటికీ, పార్లమెంట్  ఆంక్షలతో ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. లిబరల్ పార్టీకి చెందిన సెనేటర్‌ డేవిడ్‌ వాన్‌ తనతో చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని అంటూ ఆమె గురువారం మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తనను తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. ఒక రోజు పార్లమెంట్ భవనంలోని మెట్ల మార్గంలో తనను అడ్డగించి, గోడవైపు నెట్టి, తనను అభ్యంతరకర రీతిలో పట్టుకున్నాడని, అసభ్య మాటలతో బాధపెట్టాడని ఆమె సెనెట్ కు వివరించారు. బలవంతంగా లైంగిక చర్యకు ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేశారు.

అతడు చాలా పవర్ ఫుల్ వ్యక్తి అని ఆమె వివరించారు. తనను వాన్‌ అనుసరించేవారని, అభ్యంతరకరంగా తాకేవారని, దీంతో ఆఫీసు గదిలో నుండి బయటకు రావాలంటేనే భయపడేదాన్నని ఆమె పేర్కొన్నారు. డోర్‌ కొంచెం తెరిచి బయట ఆయన లేరని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్నని, పార్లమెంట్‌ ప్రాంగణంలో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నానని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

తనలాంటి దారుణ అనుభవం మరికొందరు మహిళలకు కూడా ఎదురై ఉండవచ్చని, కానీ భయంతో వారు బయటకు చెప్పడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.  పార్లమెంట్‌ నిబంధనలకు అనుగుణంగా దీనిపై తాను కేసు పెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.

అయితే, ఈ ఆరోపణలను సెనెటర్ డేవిడ్ వాన్ తీవ్రంగా ఖండించారు. దురుద్దేశంతో, తన ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.  చేతులు వణుకుతుండగా, తన ప్రకటనను ఆయన సెనెట్ లో చదివి వినిపించారు. తప్పుడు ఆరోపణలతో ఆస్ట్రేలియా సెనెట్ పరువు తీశారని సెనెటర్ లిదియా థోర్పెను విమర్శించారు. లిదియా థోర్పె ఆరోపణలు వెలుగులోకి రాగానే డేవిడ్ వాన్ ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది.