భారత్ కు అమెరికా అధునాతన సాయధ డ్రోన్ల సరఫరా

భారతదేశానికి అధునాతన సాయుధ డ్రోన్ల సరఫరాకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈ నెల చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కీలక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సంబంధిత విషయాలపై అవగాహన ఉన్నవారు తెలిపారు.  ఈ డ్రోన్లను భారత్‌కు సరఫరా చేసే విషయంలో ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది.

అయితే ఇప్పుడు ఒప్పందానికి రంగం సిద్ధం అయింది. అమెరికా నిర్మిత సీగార్డియన్ డ్రోన్లను  పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని చాలా కాలంగా భారత్ ఉత్సాహం చూపుతూ వచ్చింది.  రెండు నుంచి మూడు బిలియన్ల విలువ మేర సాయుధ డ్రోన్లను సంతరించుకోవాలని భారతదేశం ఆసక్తి చూపుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలో బ్యూరోక్రటిక్ జాప్యం, రెడ్‌టేపిజంతో ఈ దిశలో ముందు అడుగుపడలేదు.

ఈ 23న ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు అయినప్పటి నుంచి అమెరికా విదేశాంగశాఖ, పెంటగాన్, వైట్‌హౌస్ అధికారులు ఈ డ్రోన్ల సరఫరాపై ఒప్పందానికి వీలుందని భారతదేశానికి సంకేతాలు ఇచ్చింది. దీనితో భారత దౌత్య వర్గాలు కూడా ముందుకు కదిలాయి.

 ఆయుధాలను తీసుకుని వెళ్లగలిగే సామర్థంతో ఉండే దాదాపుగా 30 వరకూ సాయుధ ఎంక్యూ 9 బి సీగార్డియన్ డ్రోన్స్ ఇప్పుడు మోదీ  పర్యటన దశలో భారత్‌కు అందేందుకు రంగం సిద్ధం అయింది. ఈ డ్రోన్లను జనరల్ ఆటామిక్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రెసిడెంట్ బైడెన్ దంపతుల ఆహ్వానంపై అమెరికాకు వెళ్లుతున్న ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు.

ఆయుధ, రక్షణ పాటవ అంశాలపై సహకారం గురించి కదలికకు వీలేర్పడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి మునిషియన్స్, గ్రౌండ్ వెహికిల్స్ సహ నిర్మాణంపై బైడెన్‌తో మోడీ చర్చిస్తారని తెలిపారు. అయితే ఇరువురు నేతల మధ్య ఆయుధాల విషయంలో చర్చలు జరుగుతాయా? లేదా అనే విషయంపై నిర్ధారించడానికి వైట్‌హౌస్, విదేశాంగ శాఖ, పెంటగాన్‌లు నిరాకరించాయి.

ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తో జేక్ సలీవాన్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్‌, అమెరికాలు ఒక రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించాయి.

వీటిలో భాగంగా సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్‌, ఆర్టిఫిషియల్ ఇంటరిజెన్స్, రక్షణ రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించాయి. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఇరుదేశాలకు సంబంధించిన అనేక అంశాల్లో పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా జేక్‌ సలీవాన్ వెల్లడించారు.