పిఎఫ్‌ఐ కీలక నేత మహ్మద్ యూనస్‌ అరెస్ట్

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కీలక నేత మహ్మద్ యూనస్‌ను కర్ణాటకలో ఎన్‌ఐఏ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ కుట్ర కేసులో యూనస్ నిందితుడిగా ఉన్నాడు. పిఎఫ్‌ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్, తెలుగు రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపిన యూనస్, 2022లో ఎన్‌ఐఏ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్‌గా పేరు మార్చుకుని, షేక్ ఇలియాస్ అనే మరో వ్యక్తితో కలిసి పిఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ఇలియాస్ పరారీలో ఉన్నాడు.

నిజామాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు మరో కేసును నమోదు చేసి, పిఎఫ్‌ఐపై దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. అందరిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారు ఇచ్చిన సమాచారంతో యూనస్‌ను కర్ణాటకలో అరెస్ట్ చేసింది.

యూనస్ గతంలో నంద్యాలలో తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్ దుకాణంలో పని చేశాడు. 2022లో ఎన్‌ఐఏ సోదాల సమయంలో బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్ గా పేరు మార్చుకొని ప్లంబర్ గా పని చేస్తూ ప్రత్యేక కోడ్ భాషలో ఉగ్రవాదులతో సంభాషణలు జరుపుతున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

గత ఏడాది సెప్టెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు ఏపి, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాలే కాక, దేశ వ్యాప్తంగా ఉన్న పిఎఫ్‌ఐ కార్యాలయాల్లో ఏక కాలంలో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. యూపి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ కార్యకలాపాలపై సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.