దూసుకొస్తున్న బిపర్‌జాయ్‌.. 8 రాష్ట్రాలకు ముప్పు

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్‌ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను గురువారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది. కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు సమీపంలో గురువారం సాయంత్రం నాటికి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  తుపాను ప్రభావం గుజరాత్‌పై తీవ్రస్థాయిలో ఉండొచ్చని, రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వెల్లడించింది.
తుపాను తీరాన్ని తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో 6 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగసిపడతాయని అధికారులు తెలిపారు.  బిపర్‌జోయ్‌ తుఫాన్ ప్రధానంగా గుజరాత్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్  త్రివిధ దళాధిపతులతో మాట్లాడి తుఫాన్ సందర్భంగా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సహాయ దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గుజరాత్‌ తీరప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 17 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను అధికార యంత్రాంగం రంగంలోకి దింపింది.
 
లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు కూడా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు గుజరాత్ లోని సౌరాష్ట్ర, ద్వారక, కచ్ తీరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సముద్ర తీర ప్రాంతాల నుంచి ఇంతవరకు సుమారు 50 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించినట్టు గుజరాత్ అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో 400 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు.
 
తుపాను ముంచుకు వస్తుండటంతో ఇప్పటికే గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రంలోని కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్ నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్ కోట్ తదితర జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది.
 
మరోవైపు తుపాను ప్రభావంతో గుజరాత్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతోపాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాజస్థాన్ లో జూన్ 16వ తేదీ నుంచి ఈ తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
తుపాను తీరందాటే రోజున కచ్‌, దేవభూమి ద్వారకా, జామ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, మోర్బీతోపాటు నాఘర్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.