మణిపూర్ లో తాజా హింసలో 9 మంది మృతి

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.  వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు.
తీవ్రవాదులని అనుమానిస్తున్న కొందరు ఖమేలాక్ గ్రామంపై మంగళవారం రాత్రి దాడి చేసి 9 మంది గ్రామస్తులను హతమార్చారు. మరో 25 మంది ఈ దాడిలో గాయపడ్డారు.  తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. కాగా..అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనలో 11 మంది మరణించారు.
తీవ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో గ్రామస్తులు నిద్రిస్తుండడం, లేదా అప్పుడే భోజనం ముగించి ఉండడం జరిగిందని ఓ అధికారి చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా  గిరిజ‌న తెగ కుక్కిలు, మైటీల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ఇప్ప‌టి వ‌ర‌కు 115 మంది మ‌ర‌ణించారు. మ‌రో 40 వేల మంది వ‌ర‌కు ఆశ్ర‌యాన్ని కోల్పోయారు.