బిఆర్ఎస్ ఎమ్యెల్యే లైంగిక వేధింపులపై విచారణకు ఎన్ సి డబ్ల్యు ఆదేశం

బిఆర్ఎస్ ఎమ్యెల్యే లైంగిక వేధింపులపై విచారణకు ఎన్ సి డబ్ల్యు ఆదేశం

లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న బెల్లంపల్లి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్యపై   వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని జాతీయ మహిళా కమిషన్  తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్‌కు, వుమెన్ సేఫ్టీ విభాగం అదనపు డీజీ షికా గోయల్‌కు లేఖ వ్రాసింది.  బాధితురాలు శేజల్ ప్రస్తావించిన మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, పోలీసులు నిర్లక్ష్య వైఖరి తదితర అన్ని అంశాలపై విచారణ జరిపి 15 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.

దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ జాతీయ మహిళా కమిషన్ ఎదుట  గురువారం హాజరయ్యారు. ఇది వరకే మహిళా కమిషన్‌కు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నం కూడా చేయడంతో కమిషన్ వెంటనే స్పందించింది.

కోలుకున్న వెంటనే కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని, ఫిర్యాదు గురించి వివరించి చెప్పాలని కోరింది.  జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మను స్వయంగా కలిసిన ఆమె, దుర్గం చిన్నయ్య ఆగడాల గురించి వివరించి చెప్పినట్టు తెలిసింది.  వ్యాపారంలో భాగస్వామ్యం డిమాండ్ చేయడం నుంచి బిజినెస్ మీటింగ్ అంటూ మందు పార్టీలు పెట్టడం, ఆ పార్టీలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వరకు అన్నీ ఆమె పూసగుచ్చినట్టు వివరించింది.

 ప్రభుత్వ భూమిని అంటగట్టి మోసగించిన తర్వాత జరిగిన గొడవ నేపథ్యంలో వేధింపులు పెరిగాయని, చివరకు తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పింది. శేజల్ వెల్లడించిన విషయాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జాతీయ మహిళా కమిషన్ వెంటనే తెలంగాణ పోలీసులకు లేఖ రాసింది.

మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నం ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై కూడా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ముందు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, తమ పరిధిలో లేకపోతే జీరో ఎఫ్ఐఆర్‌ను తెలంగాణకు బదిలీ చేసే వెసులుబాటు ఉంది. కానీ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.