ఇంకా విద్యుత్ సదుపాయం లేని 67.5 కోట్ల మంది ప్రజలు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ వంట చేయడానికి కాలుష్య ఇంధనాలనే వాడుతున్నారని ఐదు అంతర్జాతీయ సంస్థలు బుధవారం విడుదల చేసిన కొత్త నివేదిక తెలిపింది. అలాగే 67.5 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్‌ సదుపాయం లేదని పేర్కొంది.  ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం, విద్యుత్‌ సౌకర్యం లేనివారు 66కోట్ల మంది వుండగా, పరిశుద్ధమైన వంట చేసుకునే అవకాశాలు 190కోట్ల మందికి లేవని ఆ నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ), అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన సంస్థ (ఐఆర్‌ఇఎ), ఐక్యరాజ్య సమితి గణాంకాల విభాగం, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.  2030కల్లా ఇంధన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రపంచ దేశాలు పయనించడం లేదని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి, లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, వాతావరణ మార్పులను వేగవంతం చేస్తుందని హెచ్చరించింది.
 
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఐఇఎ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతి బిరోల్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ సదుపాయం కలిగిన వారి సంఖ్య 2010లో 84శాతంగా వుండగా, 2021లో ఈ సంఖ్య 91శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది.
 
అయితే విద్యుత్‌ లేనివారిలో 80 శాతానికి పైగా ప్రజలు అంటే దాదాపు 56.7కోట్ల మంది సబ్‌ సహారా ఆఫ్రికాలో నివసిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, కాలుష్య కారక ఇంధనాలు, సాంకేతికతల నుండి వచ్చే వాయు కాలుష్యంతో ప్రతి ఏటా 32 లక్షల మంది అకాల మృత్యువాత పడుతున్నారు.