కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

కొన్నిరోజులుగా రానురానంటున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళ తీరాన్ని తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతారవణ శాఖ. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.

అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది.

వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు  వారం రోజులు ఆలస్యంగా.. తుఫాన్ తీవ్రతను తట్టుకుని రుతుపవనాలు కేరళను తాకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కేరళకు వచ్చిన రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటకను దాటుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి రావటానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రభావం కనిపించటానికి మరి కొంత సమయం పడుతుంది. ఈలోపు ఎండలు యథావిధిగానే ఉంటాయని వాతావరణ శాఖ అంటోంది. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాదే మరింత ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి.

కేరళను తాకిన నైరుతి రుతు పవనాల ప్రభావంతో  ఆ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. 48 గంటలుగా వాతావరణం చల్లబడింది. ఎండ తీవ్రత తగ్గి.. కూల్ వెదర్ ఉంది. చాలా చోట్ల 24 గంటలుగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశించిన సందర్భంగా అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురు, శుక్రవారాలలో  అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షం కురుస్తాయని తెలిపింది. శనివారం  కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

కాగా, అంతకు ముందు బుధవారం  మరో 40 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్‌జాయ్ తుపాను కారణంగా ఆలస్యం కావొచ్చనే అంచనాలు వినిపిస్తున్న తరుణంలో భారత వాతావరణ శాఖ స్పందించింది.
రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం ,లక్షద్వీప్, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 40గంటల్లో ఇవి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాది జూన్ ఒకటినే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు వాతావరణ నిపుణుల పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం వర్షపాతం 5 శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్‌జాయ్ తుపాను వేగంగా బల పడుతూ వస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి బుధవారం ఉదయం 5.30గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన నైరుతి ప్రాంతంలో, ముంబాయికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన నైరుతిలో, కరాచీకి 1370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమైవ ఉంది.

రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తరాన వాయువ్య దిశలో కదిలే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎటువంటి పెనుముప్పు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా సముద్ర తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలోకి చేపల వేటకు ఎవరూ వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

కాగా, రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తిస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీన పడింది. ద్రోణి ఉత్తర చత్తీస్‌గడ్ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూవుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు రాగల మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలలో వడగాలుల వీచే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని తంగులలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా 45డిగ్రీలకు పైనే నమోదయ్యాయి