తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడు విలవిలలాడి పోతుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ధరలను తగ్గించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కంపెనీలు నష్టాల నుంచి దాదాపు కోలుకోవడంతో సాధారణ పరిస్థితికి చేరువవుతున్నాయని తెలిపింది. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆయిల్ కంపెనీల్లో గణనీయమైన ఆదాయం పొందాయి. నష్టాలు భారీగా తగ్గినట్లు ప్రకటించాయి.  ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలకు వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకుని.. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నిర్ణయించాయి.
ఈ విషయమై రాబోయే మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, రానున్న త్రైమాసికాల్లో కూడా ఇటువంటి ఫలితాలు రావచ్చునని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. డీజిల్, పెట్రోలులపై అండర్ రికవరీస్ లేవు కాబట్టి వీటి ధరలను కంపెనీలు తగ్గిస్తాయని ఆశిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్  రూ.109.66గా ఉంటే, డీజిల్ లీటర్ రూ. 97. 82గా ఉంది. 2022, మే 22వ తేదీ నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అంతకు ముందు అయితే రోజువారీ మార్పులు జరుగుతూ ఉండేవి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా, ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, తగ్గటం ఉండేది.

ఏడాది కాలంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరలతో సంబంధం లేకుండా ఆయిల్ కంపెనీలు ధరలను మార్చలేదు. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. నష్టాలను పూడ్చుకున్నాయి. ఇప్పుడు వస్తున్న లాభాలను ధరల తగ్గింపుతో వినియోగదారులకు బదిలీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించడం విశేషం.