ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి

90 శాతం మేర అత్యధికంగా కర్బన ఉద్గారాలను వెలువరించడంలో బాధ్యులైన ధనిక దేశాలు భారత్ వంటి తక్కువ ఉద్గారాల దేశాలకు 170 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించవలసి ఉందని, దానివల్లనే 2050 నాటికి వాతావరణ మార్పు లక్షాలను సాధించగలుగుతాయని కొత్త అధ్యయనం వెల్లడించింది.

2050 వరకు భారత్ వార్షిక నష్టపరిహారాన్ని తలసరి 1446 డాలర్ల వరకు భరించవలసి వస్తోందని, వార్షిక నష్టపరిహారం 2018 లో జిడిపి లోని 66 శాతానికి సమానమని అధ్యయనం పేర్కొంది. నేచర్ సస్టైనబిలిటీలో ఈ అధ్యయనం వెలువడింది.

బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు ఏయే దేశాలు అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయో, అలాగే ఏవి తక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తున్నాయో వాటి ఆధారంగా 168 దేశాలను విశ్లేషించి పరిమాణాత్మక చారిత్రక బాధ్యతపై అధ్యయనం నిర్వహించారు.

భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా నిర్ధిష్ట స్థాయిలో విడుదలయ్యే హరిత వాయువుల మొత్తాన్ని కర్బన బడ్జెట్‌గా వాతావరణ సైన్స్ నిర్వచిస్తోంది. తక్కువగా కర్బన ఉద్గారాలు విడిచిపెట్టే ముఖ్యంగా భారత్ వంటి దేశాలు అత్యధికంగా ఉద్గారాలను విడిచిపెట్టే దేశాల కోసం మొత్తం కేటాయింపుల్లో అత్యధిక వాటా త్యాగం చేయాల్సి వస్తోందని అధ్యయనం వివరించింది.

అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడిచిపెట్టే టాప్ 5 దేశాలైన అమెరికా, జర్మనీ, రష్యా, బ్రిటన్, జపాన్, మొత్తం నష్టపరిహారంలో రెండొంతులు కన్నా ఎక్కువగా 131 ట్రిలియన్ డాలర్లు చెల్లించవలసి ఉందని పేర్కొంది. మరోవైపు తక్కువ స్థాయిలో ఉద్గారాలను విడిచిపెట్టే టాప్ 5 దేశాలైన బారత్, ఇండోనేసియా, పాకిస్థాన్, నైజీరియా, చైనా నష్టపరిహారంగా 102 ట్రిలియన్ డాలర్లను పొందవలసి ఉందని అధ్యయనం పేర్కొంది.