ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు

కర్ణాటకలో ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బెంగళూరు, కర్ణాటకలోని ఇతర జిల్లాల్లో నిరసనను కొనసాగించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక షరతులు పెట్టిందని, దీని వల్ల నిర్వాసితులకు లబ్ధి చేకూరడం కష్టమని బీజేపీ ఆరోపించింది.

కాగా, ఆవులను విధించడంపై రాష్ట్ర  పశుసంవర్ధక శాఖామంత్రి కె వెంకటేష్ చేసిన వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి శ్రేణులు బెంగుళూరు నగరంలో ఆవులతో నిరసన ప్రదర్శన జరిపారు. ఇతర పశువులను వాదిస్తుంటే లేని తప్పు, ఆవులను వధిస్తే ఎందుకని అంటూ మంత్రి పేర్కొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోహత్య నిరోధక చట్టం ప్రకారం గోవులను వధించడం కఠినమైన శిక్షార్హమని అంటూ మంత్రి వాఖ్యలు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేవిధంగా ఉన్నాయని బిజెపి నేతలు విమర్శించారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి వాఖ్యలకు నిరసనగా గోవులకు పూలదండలు వేసి, పూజిస్తూ నిరసనలు జరిపారు.

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సుంకాల పెంపుపై సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని నిందించింది. కాంగ్రెస్ “ద్వంద్వ ప్రమాణం” చేసిందని పేర్కొంది. అన్ని జిల్లాల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆవులు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘గృహ జ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది.

అధికారం చేపట్టిన తర్వాత, ప్రభుత్వం దీని కోసం అనేక షరతులు విధించిందని మంగళూరు విభాగ్ ప్రభారి, మైసూర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఉదయ్ కుమార్ శెట్టి తెలిపారు. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలం కావడమే కాకుండా విద్యుత్ ఛార్జీలను కూడా పెంచిందని శెట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వారి అసలు రంగు బయటపడిందన్న ఆయన.. ఇది ‘గృహ జ్యోతి’ పథకం కిందకు రాని కుటుంబాలపై, అలాగే అదనపు యూనిట్ల విద్యుత్ వినియోగించే ‘గృహ జ్యోతి’ లబ్ధిదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందిని శెట్టి తెలిపారు.