భారతీయ నౌకాదళం మరో అరుదైన ఘనత

భారతీయ నౌకాదళం మరో అరుదైన ఘనతను సాధించింది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన భారీ టార్పెడోతో సముద్ర జలాల లోపల ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో సముద్ర జలాలు లోపల ఉన్న శత్రు లక్ష్యాలను చేధించే దిశగా కీలకమైన ముందడుగు పడింది.

ఈ హెవీ వెయిట్ టార్పెడో ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయంగా రూపొందించారు. భారతీయ నౌకాదళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్  సంయుక్తంగా ఈ టార్పెడోను అభివృద్ధి చేశాయి.

‘‘పూర్తిగా దేశీయంగా తయారు చేసిన హెవీ వెయిట్ టార్పెడోతో నీటి అడుగున ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా చేధించగలిగాం. ఈ ప్రయోగం నీటి లోపల శత్రు లక్ష్యాలను చేధించే స్వదేశీ టార్పెడోలను అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్న భారతీయ నౌకాదళానికి, డీఆర్డీఓకు ఒక ముఖ్యమైన మైలురాయి’’ అని భారత నావికాదళం ఒక ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ కు లక్ష్యాన్ని చేధిస్తున్న వీడియోను అటాచ్ చేసింది. అలాగే, ఆత్మ నిర్భర్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ఇచ్చింది. అయితే ఈ టార్పిడో పేరును గానీ.. ఇతర ఫీచర్లను గానీ నౌకాదళం వెల్లడించలేదు. హిందూ మహా సముద్రంలో చైనాతో ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు, ఇప్పటికే భారత నౌకాదళం వద్ద వరుణాస్త్ర అనే అధిక బరువు గల టార్పిడో ఉంది. ఇది స్వయం చోదిత, నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి. 30 కిలోమీటర్ల దూరంలోని శత్రు నౌకల లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది.

కాగా, నావికాదళం మంగళవారం మరో ఘనతను కూడా సాధించింది.  భారతీయ నౌకాదళానికి చెందిన ఎంహెచ్ -60 మల్టీ రోల్ హెలీకాప్టర్ ‘రోమియో’.. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై విజయవంతంగా ల్యాండ్ అయింది.  ఈ ఎంహెచ్ 60 అన్ని వాతావరణ పరిస్థితుల్లో నౌకాదళానికి సేవలు అందించే హెలీకాప్టర్. దీన్ని అమెరికా అభివృద్ధి చేసింది. అమెరికా నుంచి మొత్తం 24 ఎంహెచ్ 60 హెలీకాప్టర్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో రెండు చాపర్లను అమెరికా 2021 జులైలో డెలివరీ చేసింది.