మణిపూర్ లో తాజా హింసలో బీఎస్ఎఫ్ జ‌వాను మృతి

మణిపూర్ లో తాజా హింసలో బీఎస్ఎఫ్ జ‌వాను మృతి

హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) జవాను ఒకరు ప్రాణాలు కోల్పోగా, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సెరోవు ప్రాంతంలో ఏరియా డామినేషన్ ఆపరేషన్స్‌లో ఈ సంఘటన జరిగింది.  సెరోవు ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్లో ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికి బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంద‌ర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం సిరౌ ఏరియాలో తిరుగుబాటుదారుల కార్య‌క్రమాల‌ను అణిచివేసేందుకు నిన్న రాత్రి అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్ జ‌వాన్లు క‌లిసి చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో తిరుగుబాటుదారులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలిపారు.

ఒక జ‌వాను మృతి చెందాడ‌ని, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. తిరుగుబాటుదారుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. సైనికాధికారుల కథనం ప్రకారం, భద్రతా దళాలు, మిటిటెంట్ల మధ్య సోమవారం రాత్రంతా కాల్పులు జరిగాయి. మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.

సోమవారం కాంగ్‌చూప్‌ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు ఇంఫాల్‌ సర్కారీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

కాక్చింగ్‌ జిల్లా సెరో ప్రాంతంలో మరో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.  ఇదిలావుండగా, కాక్చింగ్ జిల్లాలోని సెరోవూ గ్రామంలో దాదాపు 100 ఇళ్లను మిలిటెంట్లు ఆదివారం తగులబెట్టారు. ఈ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

సెవోవూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కే రంజిత్ సింగ్ ఇంటిని మూకలు ధ్వంసం చేశాయి. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. కూంబింగ్ ఆపరేషన్లో 40 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆటోమేటిక్ రైఫిళ్లు ఎక్కువగా ఉన్నాయి.

అదేవిధంగా మోర్టార్లు, పేలుడు పదార్థాలు వంటివాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కుకీ తదితర తెగలవారి మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 310 మంది గాయపడ్డారు. సుమారు 4,000 గృహదహనం కేసులు నమోదయ్యాయి. సుమారు 36 వేల మంది నిరాశ్రయులయ్యారు.