రాష్ట్రపతి ముర్ముకు సురినాం అత్యున్నత పౌరపురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్  అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘గ్రాండ్  ఆర్డర్ ఆఫ్ ద చైన్  ఆఫ్​ ది ఎల్లో స్టార్’ అవార్డును సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పర్సాద్  సంతోఖి.. ముర్ముకు అందజేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తూ ముర్ముకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
 
మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఆదివారం ముర్ము సురినాం చేరుకున్నారు. ”ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ పురస్కారం ప్రతిబింబిస్తోంది.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఈ అవార్డును అందుకోవడం తనకెంతో గౌరవప్రదంగా వుందని రాష్ట్రపతి ద్రౌపది వ్యాఖ్యానించారు. ”ఈ గుర్తింపునకు అపారమైన ప్రాముఖ్యత వుంది. ఈ అవార్డు కేవలం నాది మాత్రమే కాదు, 140కోట్ల మంది ప్రజలది, వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ అవార్డును అందుకున్నాను.” అని ఆమె సోమవారం ట్వీట్‌ చేశారు.
 
ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పరిపుష్టం చేయడంలో అద్భుతమైన పాత్ర పోషించిన ఇరుదేశాల వరుస తరాలకు ఈ పురస్కారాన్ని ఆమె అంకితం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు.
 
సురినాం ప్రభుత్వం, ప్రజల నుండి వచ్చిన ఈ ప్రత్యేకమైన పురస్కారం ఇరు దేశాల మధ్య గల శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా వుందని పేర్కొంటూ మోదీ  ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనను అభినందించడానికి వచ్చిన పిల్లలతో కాసేపు సమయం గడిపారు. భారత్‌లో తయారైన చాక్లెట్లను వారికి ఇచ్చారు.
 
అనంతరం ఆమె ‘మెరైన్‌ట్రాప్‌’ను సందర్శించారు. ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌లో సిమ్యులేటెడ్‌ గ్రామాన్ని ప్రారంభించారు. సోమవారం ఇరు పక్షాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. సురినాంకు మొదటిసారిగా భారతీయులు వచ్చి 150 ఏళ్లు పూర్తి కావడం, తన మొదటి విదేశీ పర్యటన కూడా ఇదే కావడం సంతోషంగా వుందని ముర్ము తెలిపారు.