ఉక్రెయిన్‌లో నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చేసిన రష్యా

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన నీపర్‌ నది పై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ ను రష్యాదళాలు పేల్చేశాయి. మంగళవారం తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడంతో వరద పోటు మొదలైంది.
 
అయితే, తాజా ఘటనపై రెండు దేశాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇది రష్యా పనే అని ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఆరోపించగా  ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడి అని చెబుతుండటం గమనార్హం. రష్యా మేయర్‌ వ్లాదిమిర్‌ లియోనేటివ్‌ మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి 2 గంటల నుంచి కఖోవ్కా హైడ్రోపవర్ ప్లాంట్‌పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో గేటు వాల్వులు దెబ్బతిని నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా ప్రవాహం మొదలైంది’’ అని తెలిపారు.
 
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది.  గత కొన్ని రోజులుగా ఈ డ్యామ్‌కు సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రం లో భాగంగా దీన్ని నిర్మించారు.  ఈ డ్యామ్‌ 30 మీటర్ల ఎత్తు, 3.2 కిలోమీటర్ల పొడవు ఉంది.
అమెరికాలోని ఉటాలో గల గ్రేట్‌ సాల్ట్‌ లేక్‌కు సమానమైన నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  తాజా పరిణామంతో ఈ డ్యామ్‌లోని నీరంతా ఖేర్సాన్‌ వైపు ప్రవహించి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఐదు గంటల్లో వరద నీరు అక్కడకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.  దీంతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖేర్సాన్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, డ్యామ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.