విషప్రయోగంతో 80 మంది ఆఫ్ఘన్ పాఠశాల బాలికల అస్వస్థత

ఆప్ఘనిస్తాన్‌ ఉత్తరాన సార్‌ – ఎ-పుల్‌ ప్రావిన్స్‌లోని రెండు ప్రాథమిక పాఠశాల్లోని బాలికలని లక్ష్యంగా చేసుకుని వారిపై విష ప్రయోగం జరిగింది. దీంతో దాదాపు 80 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని విద్యాశాఖ అధికారి తెలిపారు. ఆఫ్గాన్‌లోని సంచారక్‌ జిల్లాలోని నస్వాన్‌ ఎ-పుల్‌ – ప్రావిన్స్‌లో నస్వాన్‌ ఎ – కబోద్‌ ఆబ్‌ స్కూల్‌, నస్వాన్‌ – ఎ- ఫైజాబాద్‌ పాఠశాలల్లోని విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది.

ఈ వరుస ఘటనలు శని, ఆదివారాల్లో జరిగినట్లు ఆఫ్గన్‌లోని ఫాక్స్‌ న్యూస్‌ అనే మీడియా ఛానెల్‌ పేర్కొంది. ఈ ఘటనపై ప్రావిన్షియల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ రహ్మానీ మాట్లాడుతూ ఒకటి నుంచి ఆరో తరగతి చదువుతున్న చిన్నారులని లక్ష్యంగా చేసుకుని ఈ విష ప్రయోగం జరిగిందని చెప్పారు.

ఈ ఘటనలో 60 మంది నస్వాన్‌ ఎ-కబోద్‌ ఆబ్‌ స్కూల్‌కి చెందిన చిన్నారులు ఉన్నారని, నస్వాన్‌-ఎ-ఫైజాబాద్‌ పాఠశాలకు చెందిన 17 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ రెండు పాఠశాలలు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల వీటిని లక్ష్యంగా చేసుకుని విద్యార్థినిలపై విష ప్రయోగానికి పాల్పడినట్లు రహ్మానీ తెలిపారు.

అయితే విష ప్రయోగం తర్వాత వెనువెంటనే చిన్నారులకు ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని రహ్మానీ వెల్లడించారు. కాగా, పాఠశాల్లోని విద్యార్థులపై విష ప్రయోగం జరిపేందుకు థర్డ్‌ పార్టీకి డబ్బులు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని రహ్మానీ వెల్లడించారు.

అయితే బాలికలకు ఎలా విష ప్రయోగం జరిగింది? వారి గాయాల గురించి రహ్మానీ మీడియాకు ఎలాంటి విరాలను వెల్లడించలేదు. ఇలాంటి ఘటనలు ఆఫ్గనిస్తాన్‌లోనే కాదు, పొరుగున ఉన్న ఇరాన్‌లో కూడా జరిగాయి. గతేడాది నవంబర్‌లో ఇరాన్‌లోని పాఠశాల విద్యార్థినీలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.

2022 కోమ్‌ నగరంలోని పాఠశాలల్లోని విద్యార్థినులపై రసాయన వాయువులను విడుదల చేయడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇరాన్‌లో జరిగిన ఘటనతో తాజాగా ఆప్ఘనిస్తాన్‌లో జరిగిన ఘటనతో ఫాక్స్‌ మీడియా ఛానెల్‌ అభివర్ణించింది.  2021లో ఆప్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్కడున్న మహిళలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇక బాలికలు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు ఆరో తరగతి కంటే పై చదువులు చదవకూడదని తాలిబన్‌ ప్రభుత్వం వారిపై ఆంక్షల్ని విధించిన సంగతి తెలిసిందే.