విదేశాలకు వెళ్లిన్నప్పుడూ రాజకీయాలేనా!

అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత  రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయ విమర్శలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రంగా తిప్పికొట్టారు. ‘‘విదేశాలకు వెళ్లినప్పుడు రాజకీయాల కన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉంటాయి”అని రాహుల్ పేరు ప్రస్తావించకుండా జైశంకర్ హితవు చెప్పారు.

విదేశాల్లో ఉన్నప్పుడు తాను రాజకీయాలు చేయనని, కానీ భారత్ లో ఉన్నప్పుడు మాత్రం విమర్శలకు ధీటుగా జవాబిస్తానని చెప్పారు. ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత కేప్ టౌన్ లో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లతో చిట్​చాట్ చేశారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండ ‘‘అమెరికా పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి భారత రాజకీయాలపై చేస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి?”అని ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నించాడు. దీనికి మంత్రి స్పందిస్తూ ప్రజాస్వామ్య సంస్కృతి ఉమ్మడి బాధ్యత అంటూ దేశ ప్రతిష్టను నిలబెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్నప్పుడు దేశ రాజకీయాలకంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ‘‘నేను విదేశాల్లో ఉన్నప్పుడు నా గురించే మాత్రమే మాట్లాడుతా. దేశ రాజకీయాల గురించి మాట్లాడను. భారత్ లో  మాత్రం విమర్శలకు ధీటుగా బదులిస్తా. భారత్  వెళ్లాక ఏంచేస్తానో మీరే చూస్తారు” అంటూ జైశంకర్ నర్మగర్భంగా చెప్పారు.

రాహుల్ గాంధీ శాన్ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నేడు భారత దేశంలో ముస్లింలకు ఏమి జరుగుతుందో 1980లలో దళితులకు అదే విధంగా జరిగిందంటూ విమర్శించారు. పైగా, దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, ఆ తర్వాత నంబియాలో భారతీయులతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ ఒడిశా రైలు ప్రమాదం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు, విదేశాంగ మంత్రులు, ప్రముఖులు పంపుతున్న సంతాప సందేశాలను చూస్తుంటే నేడు భారత్ అంతర్జాతీయంగా ఏవిధంగా అనుసంధానమైందో వెల్లడవుతోంది తెలిపారు.  భారత దేశంలో ఒక విషాదం జరిగితే మొత్తం ప్రపంచం భారత్ కు బాసటగా నిలబడుతున్నదని చెప్పారు.