750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూలు 

750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూలు 

అమెరికా వీసా ఇంటర్యూల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా 10 రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూలను నిర్వహించేలా స్పెషల్ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులు, వ్యాపారవేత్తలకు  కేవలం పది రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ దక్కించుకునేలా ee  సరికొత్త ‘ప్రీమియం’ త్వరితగతిన సర్వీస్‌ను ప్రవేశపెట్టబోతోంది. 

దీనికోసం ప్రీమియం ఎక్స్‌పెడైటెడ్ సర్వీస్ పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించినట్లు అమెరికా విదేశాంగశాఖ తమ ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించింది. ఈ నోటీసు ప్రకారం జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.   ఈ సేవలను వినియోగించుకోవాలంటే సాధారణ ఫీజు 185 డాలర్లకు అదనంగా 750 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాటి జాబితాను జూలై 1వ తేదీకి ముందు ప్రకటించనున్నారు.  ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ప్రవేశ నిబంధనలనున మరింత కఠినతరం చేశారు. కొన్ని దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ కోసం భారీ బాండ్లు విధించడం, సోషల్‌మీడియా అకౌంట్లు సహా వ్యక్తిగత వివరాలపై విస్తృత పరిశీలన చేపట్టడం వల్ల వీసా ప్రక్రియలో ఆలస్యాలు పెరిగాయి. 

దీంతో అనేక దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే స్పెషల్ పైలట్ ప్రోగ్రామ్ కింద ప్రీమియం సర్వీస్‌ను అమెరికా ప్రవేశపెట్టడం గమనార్హం. అయితే, ఈ అదనపు ఫీజు చెల్లించడం ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను మాత్రమే త్వరగా పొందగలరని, వీసా కచ్చితంగా మంజూరు అవుతుందనే హామీ లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల అర్హతల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. డిమాండ్‌ను బట్టి ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను వచ్చే ఏడాదికి పొడిగించే అవకాశం ఉందని సమాచారం.