న్యూయార్క్ వాసులు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి

అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని పొగ కమ్మేసింది. కెనడాలోని కార్చిచ్చు వల్ల న్యూయార్క్ సిటీలో ఆకాశం అంతా పొగతో నిండి పోయింది. గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. దీంతో ఈ కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. న్యూయార్క్ వాసులు  కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

బుధవారం మధ్యాహ్నం నాటికి న్యూయార్క్‌ నగరంలో ప్రపంచంలోని ఏ నగరంలో లేనంత వాయు కాలుష్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు కాలుష్యం కారణంగా మన్‌హట్టన్‌ నగరంలోని ప్రముఖ ఆకాశహర్మ్యాలు వింతగా, పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్నాయి. దట్టమైన వాయు కాలుష్యం కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని, క్రీడా కార్యక్రమాలను వాయిదా వేయవలసి వచ్చిందని అధికారులు ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రజలు ఔట్ డోర్ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. న్యూయార్క్ లో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకొంది.  ఢిల్లీ, బాగ్దాద్ నగరాల కన్నా న్యూయార్క్ నగరంలో అత్యధిక కాలుష్యం ఉన్నట్టు చెప్పారు.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 226 గా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218 వరకు పడిపోయే ప్రమాదం వుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఓ ప్రకటనలో తెలిపారు. న్యూయార్క్ వాసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపడతామని ఆడమ్స్ ప్రకటించారు. అమెరికా అంతటా ఆకాశం ఆరెంజ్ రంగులోకి మారింది. కార్చిచ్చు కారణంగా సాధారణం కంటే 2 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది.

కెనడాలో రగిలిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని 18 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కార్చిచ్చు వల్ల వెలువడుతున్న పొగ వాతావరణం కాలుష్యానికి కారణమైంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందక్కడ. పొగ గాఢత తక్కువ పరిణామంలో ఉన్నప్పటికీ ఆ గాలిని పీల్చితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఊపిరి తిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. వృద్దులు, పిల్లలు, మహిళలు, గర్బిణులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాలుష్యం నేపథ్యంలో నగర వాసులు ఔట్‌డోర్ కార్యక్రమాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని సూచించారు. ఇక కెన‌డాలో కార్చిచ్చు అంటుకుంది. అత్యంత వేగంగా అడవులను కార్చిచ్చు దహిస్తోంది. 415 ప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి.

కార్చిచ్చుతో కెనడా, అమెరికాలో సుమారు 100 మిలియన్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమవుతున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెనడా రికార్డు చరిత్రలో ఈ కార్చిచ్చు అతిపెద్దదని ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చెప్పారు. ఇప్పటివరకు 3.8 మిలియన్‌ హెక్టార్లల్లో అడవులు కాలిపోయినట్లు కెనడియన్‌ నేషనల్‌ ఫైర్‌ డేటాబేస్‌ పేర్కొంది.

గతంలో న్యూజెర్సీలో జరిగిన దానికంటే రెట్టింపు పరిమాణమని పేర్కొంది. కెనడాలో కార్చిచ్చు కారణంగా 20,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1960 తరువాత ఈ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడం ఇదే మొదటిసారి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల కారణంగా పలు విమానాలను కూడా దారి మళ్లించినట్లు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. లో- విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడినట్లు వివరించారు. రైళ్ల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.