సాగునీటిపై కేసీఆర్ అంకెల గారడీ

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా నీటిపారుదల రంగానికి రూ. 1.55 లక్షల కోట్లు ఖర్చు చేసి 17.23 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరందించినట్లు చెబుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో విడుదల చేసిన ప్రగతి నివేదికలో చెప్పడం అంకెల గారడీ మాత్రమే అని  బిజెపి తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జ్, మాజీ మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు.

అదే నివేదికలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరిచ్చామని, ఆ ప్రాజెక్టు ద్వారానే 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని చెప్పారంటూ  ఇదెట్లా సాధ్యం? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టును స్రుష్టించినట్లు చెప్పగా, ఇరిగేషన్ శాఖ వెబ్ సైట్ లో కాళేశ్వరం ద్వారా 57 వేల ఎకరాలకు సాగునీరందించినట్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

రీడిజైన్ల పేరుతో లక్షకుపైగా కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టువల్ల ఏటా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద పడే భారం రూ. 8,677 కోట్లు.  అంటే ఒక ఎకరానికి రూ. 47 వేలు ఖర్చు అంటూ ఒక రైతు ఎకరా వడ్లు పండిస్తే కూడా ఇంత పంటరాదని ధ్వజమెత్తారు. పైగా, కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరివ్వలేదని స్పష్టం చేశారు.

 
ఇలాంటి అద్బుత ఇంజనీరింగ్ నైపుణ్యం కేసీఆర్ కే సాధ్యం అంటూ ఎద్దేవా చేశారు.  నిజంగా 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరిస్తే ఆ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు.  కాగా,  కాళేశ్వరం, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు కట్టినా కాలువలే తవ్వలని చెబుత అసలు కాలువలే తవ్వకుండా కొత్త ఆయకట్టు ఎట్లా సాగులోకి వస్తుంది? కేసీఆర్ అద్బుత ఇంజనీరింగ్ అంటే ఇదేనా? అంటూ బీజేపీ నేత ప్రశ్నించారు.

2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చాక కొత్తగా కట్టిన ప్రాజెక్టులవల్ల అదనంగా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే వారు కట్టిన ప్రాజెక్టులవల్ల ఏ నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలకు కొత్తగా సాగునీరందించారో శ్వేత పత్రం విడుదల చేస్తారా? అని సవాల్ చేశారు.

• డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2.76 కోట్ల ఎకరాలుంటే, అందులో 61.77 లక్షల ఎకరాలు అటవీ భూమి అని ఆయన చెప్పారు. 34.59 లక్షల ఎకరాలు బీడు భూములు కాగా, 22.23 లక్షల ఎకరాలు  వ్యవసాయేతర అవసరాలకు (రియల్ ఎస్టేట్, వాణిజ్యం) వినియోగిస్తున్నారని సుధాకరరెడ్డి వివరించారు.

ఇక మిగిలింది 1.06 కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగు యోగ్యమైనదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందుతోందని ఈ గణాంకాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. మిగిలిన భూములన్నీ, అంటే దాదాపు 84% బోర్‌వెల్ నీటిపారుదలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 18 లక్షలకుపైగా వ్యవసాయ బోర్లుండగా, ఈ పదేళ్లలో ఆ సంఖ్య 26 లక్షలు దాటిందని చెబుతూ  నిజంగా ప్రాజెక్టులు కట్టి ఉంటే, అవి సాగులోకి వచ్చి ఉంటే బోర్ల సంఖ్య తగ్గేవిగదా అని ప్రశ్నించారు.