రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని భావించడానికి వీలుగా ప్రాథమిక ఆధారాలు లభించడం వల్లనే సీబీఐ దర్యాప్తును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయాల పాలయ్యారు.

ఈ ఘటనపై వెంటనే శాఖాపరమైన దర్యాప్తులో భాగంగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ జరిపిన దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయని, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో కావాలనే మార్పులు చేసినట్లుగా గుర్తించారని రైల్వే వర్గాలు వెల్లడించాయి.  సీఆర్ఎస్ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు అవసరమన్న నిర్ణయానికి వచ్చారని, అందుకు సీబీఐ వంటి ప్రొఫెషనల్ ఏజెన్సీనే సరైనదనే నిర్ణయానికి వచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ఒక వార్తాసంస్థకు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో చేసిన మార్పు కారణంగానే మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ రైలును ఢీకొన్నదని వివరించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో ఎవరు, ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు.

‘ఎవరైనా కావాలని చేస్తే తప్ప.. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు వెళ్లేలా అలా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో మార్పు జరగదు’ అని స్పష్టం చేశారు. ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం తెలిసిందని, అందుకు కారణమైన క్రిమినల్స్ ఎవరో కూడా తెలిసిందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం సంచలన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును కోరినట్లు తెలుస్తోంది.

తిరిగి పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌

సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి ట్రాక్‌ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేయడంతో గత శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదానికి గురైన  చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ మూడు రోజుల తర్వాత మళ్లీ పరుగులు పెట్టింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు రైల్వే శాఖ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించింది.

మంగళవారం ఉదయం 10.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి కోరమాండల్ తన సేవలు ఆరంభించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ నుండి షాలిమార్‌ కు, షాలిమార్ నుండి ప్రతిరోజు ప్రయాణం సాగిస్తుంటుంది.  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకారం  రైలు నంబర్ 12842 చెన్నై సెంట్రల్ నుండి ఉదయం 7 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి, మరుసటి రోజు అనగా గురువారం ఉదయం 10:40 గంటలకు షాలిమార్‌ చేరుకోనుంది.

తిరిగి రైలు నంబర్ 12841, జూన్ 7న గురువారం మధ్యాహ్నం 15:20 సమయంలో షాలిమార్ నుండి బయలుదేరి మరుసటి రోజు అనగా శుక్రవారం సాయంత్రం 16.50కి చెన్నై సెంట్రల్‌కు చేరుకోనుంది.