ఇది కచ్చితంగా విద్రోహ చర్యే!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదాన్ని విద్రోహ చర్య అని, ఇది పక్కా ప్రణాళికతో చేసినట్లు అనిపిస్తోందని బీజేపీ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది ఆరోపించారు. సోమవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇది విద్రోహ చర్య అయి ఉంటుందనే అంశాన్ని తోసిపుచ్చలేమని చెప్పారు.

‘‘ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ, దాని పనితీరు, సంఘటనలో ఏమి జరిగింనేదాని గురించి అందిన సమాచారం, నాకున్న అవగాహన ప్రకారం కోరమాండల్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాన ట్రాక్‌పైకి కాకుండా లూప్‌లైన్‌లోకి నడిపించిన వ్యవహారంలో తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు భావించాను. విచారణ అనంతరం మరిన్ని అంశాలు బయటకు వస్తాయి” అని తెలిపారు.

తానైతే ఇది ప్రమాదం కాదని, 100 శాతం విద్రోహ చర్య అని కచ్చితంగా చెప్పగలనని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు ఒకదాని వెనుక ఒకటి జరిగేలా పక్కా ప్రణాళికతో ఇదంతా జరిగినట్టు తనకు అనిపిస్తోందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చూస్తే పెద్ద భూకంపం వచ్చిన్నట్లున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేయడాన్ని ఆయన కొట్టిపారవేసారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని హితవు చెప్పారు. మృతదేహాలపై ఎవ్వరూ రాజకీయాలు చేయకోకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతి పెద్ద, సమర్ధవంతమైన వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు.

నేడు నూతన సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని చెబుతూ జపాన్ మాదిరిగా ప్రమాదాల కారణంగా ఒక్కరు కూడా మృతి చెందకుండా ఉండేందుకు మనం కృషి చేయాలని త్రివేది సూచించారు.

మెయిన్‌ లైన్‌లో గ్రీన్‌సిగ్నల్‌ పడితే కోరమాండల్‌ లూప్‌లైన్‌లోకి ఎందుకు వెళ్లిందనేదే ఇక్కడ ప్రశ్న. ఇం టర్‌లాకింగ్‌ వ్యవస్థలో లోపం కారణంగానే రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లకుండా లూప్‌లైన్‌లోకి వచ్చి అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ని ఢీకొట్టిందని చెబుతున్నారు.

ఇక్కడే అనుమానం తలెత్తుతోంది. ఒకవేళ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ విఫలమైనా, ఏదైనా అవకతవకలు జరిగినా వెంటనే ఫెయిల్‌-సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుందని నిపుణులు చె బుతున్నారు. అలాంటప్పుడు అన్ని ట్రాక్‌లపైనా రెడ్‌సిగ్నల్‌ పడి రైలు ఆగిపోవాలంటున్నారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. దీంతో ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేసిన విద్రోహ చర్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.