ఏ ఎన్నికలు వచ్చినా కలిసికట్టుగా బీజేపీ, శివసేన

భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా శివసేన, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తాను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసినట్టు ఓ ట్వీట్‌లో షిండే తెలిపారు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది.

”అమిత్‌షాతో మేము జరిపిన సమావేశంలో భవిష్యత్తులో జరిగే లోక్‌‍సభ, అసెంబ్లీ, మున్సిపల్ సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. కలిసికట్టుగా పోటీ చేసి అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తాం” అని షిండే ఆ ట్వీ్ట్‌లో పేర్కొన్నారు.

అమిత్‌షాతో జరిపిన సమావేశంలో వ్యవసాయం, సహకార రంగం అంశాలపై కూడా చర్చించిట్టు చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల పనులు వేగవంతంగా జరుగుతూ పూర్తికావస్తున్నాయని తెలిపారు. ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ ప్రధాన మంత్రి నుంచి మార్గదర్శకాలు అందుతున్నాయని, సహకార రంగం గురించి కూడా అమిత్‌షాతో సమగ్రంగా చర్చించామని చెప్పారు.

గత ఏడాది, షిండే 39 మంది ఎమ్మెల్యేలతే అప్పటి అవిభక్త శివసేనపై తిరుగుబాటు చేశారు. దీంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం బీజేపీతో షిండే చేతులు కలిపి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.