
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన తర్వాత స్పష్టం చేశారు. ఫకీర్‌మోహన్ ఆస్పత్రిలో గాయపడిన ప్రయాణికులను పరామర్శించిన మోదీ.. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.
క్షతగాత్రులను కలిసిన అనంతరం ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ, “ఇది బాధాకరమైన సంఘటన. గాయపడిన వారి చికిత్స కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టదు. ఇది తీవ్రమైన సంఘటన, ప్రతి కోణం నుండి విచారణకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తాము. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు కృషి జరుగుతుంది. నేను గాయపడిన బాధితులను కలిశాను” అని తెలిపారు.
ఈ సంఘటన గురించి చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని చెబుతూ ఈ విషాదకర పరిస్థితి నుండి బయటపడేందుకు అవసరమైన శక్తిని దైవం మనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న ప్రధాని ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బాలాసోర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి పరిశీలించారు. ఇక్కడకు చేరుకోవడానికి ముందే, పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రధాని మోదీ ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ దారుణ విషాదాన్ని తగ్గించడమే మొత్తం ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు.
సంఘటన జరిగిన ప్రదేశం నుండే ప్రధాన మంత్రి క్యాబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు.
బాలాసోర్ రైలు ప్రమాద స్థలంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత, గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బాలాసోర్‌లోని ఆసుపత్రికి ప్రధాని మోదీ చేరుకున్నారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరగగానే బాధితులను ఆదుకునేందుకు ఒడిశా పోలీసులు అందించిన సేవలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్