కోరమాండల్ రైలు లూప్‌ లైన్‌లోకి తప్పుగా వెళ్లడమేకారణమా!

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.  అయితే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తప్పుడు ట్రాక్‌లోకి వెళ్లడం మానవ తప్పిదమేనని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది.
 కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌ లైన్‌లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి అసలు కారణమని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. లూప్ లైన్ లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఢీకొట్టగా, బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని, దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.
 
ప్రమాదానికి ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ తప్పుడు ట్రాక్‌లో ప్రయాణించినట్లు రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు ఉన్న మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లో ఆ రైలు ప్రయాణించినట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కాగా, ఖరగ్‌పూర్ డివిజన్ సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్‌కు సంబంధించిన వీడియోల ప్రకారం మూడు రైళ్ల ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్‌ లైన్లతో సహా నాలుగు రైల్వే ట్రాక్‌లున్నట్లు తెలుస్తున్నది.

గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆ లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నది. దాని కంపార్ట్‌మెంట్‌లు మెయిన్‌ లైన్‌పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే ఆ మెయిన్‌ లైన్‌లో వస్తున్న యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది.

మరోవైపు సాధారణంగా లూప్‌ లైన్‌ 750 మీటర్ల పొడవు ఉంటాయి. గూడ్స్‌ రైళ్ల కోసం ఎక్కువగా లూప్‌ లైన్లు వినియోగిస్తారు. బహానగర్ బజార్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలోని సిగ్నల్ ప్యానెల్ ప్రకారం అక్కడి లూప్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి ఉంది.  అయితే గూడ్స్‌ రైలు చివరి బోగీలు మెయిన్‌ లైన్‌లో నిలిచి ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 127 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ గూడ్స్‌ రైలు బోగీలను ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు.

మూల కారణంపై సమగ్ర దర్యాప్తు 

బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. క్రేన్ల ద్వారా పట్టాలు తప్పి పడిపోయిన బోగీలను ట్రాకుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం వెనుక మూల కారణాన్ని వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని వైష్ణవ్ చెప్పారు. భవిష్యుత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

దుర్ఘటనలో 292 మంది మృతి

రైలు దుర్ఘటనలో ఇప్పటి వరకూ 292 మంది మృతి చెందగా,1000 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయినవారి వివరాలను వెల్లడించడం కూడా రైల్వేశాఖ అధికారులకు కష్టతరంగా మారింది. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా భువనేశ్వర్‌, ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. రైలు ప్రమాదంలో 100 మందికిపైగా తెలుగువాళ్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. రెండు రైళ్లలో 200 మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి