గౌతమి ఎక్స్ప్రెస్ నుంచి కోరమండల్ వరకు..

ఒడిశా రైలు ప్రమాదం ఘటన యావత్​ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్షతగాత్రుల సంఖ్య 900 దాటిపోయింది. ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది.  అయితే.. గత రెండు దశాబ్దాలలో అనేక రైలు ప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వీటిల్లో కొన్ని మాటలకందని విషాదాన్ని మిగిల్చాయి.

2008 జులై 31:- సికింద్రాబాద్​ నుంచి కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్​ప్రెస్​కు మంటలు అంటుకున్నాయి. కేసముద్రం- తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్లకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు బోగీలు పూర్తిగా దహనమైపోయాయి. 32మంది అగ్నికి ఆహుతయ్యారు.

2011 జులై 7:- ఉత్తర్​ ప్రదేశ్​ ఈటాహ్​కు సమీపంలో ఛప్రా- మథురా ఎక్స్​ప్రెస్​ ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. రైలు హైస్పీడ్​లో వస్తున్న సమయంలోనే పట్టాలను దాటేందుకు బస్సు ప్రయాణించడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరకిలోమీటర్​ వరకు బస్సును ఈడ్చుకెళ్లింది రైలు.

భారతీయ రైల్వేల చరిత్రలో 2012 ఏడాదిని అతి ఘోరమైన సంవత్సరంగా భావిస్తుంటారు. ఒక్క ఏడాదిలో 14కుపైగా ప్రమాదాలు జరిగాయి. రైళ్లు పట్టాలు తప్పడాలు, రైళ్లు పరస్పరం ఢీకొనడాలు తరచుగా వార్తలకెక్కేవి.

2012 జులై 30:- నెల్లూరుకు సమీపంలో ఢిల్లీ- చెన్నై తమిళనాడు ఎక్స్​ప్రెస్​కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు.

2014 మే 26:- ఉత్తర్​ ప్రదేశ్​ సంత్​ కబీర్​ నగర్​ ప్రాంతంలోని ఖలలాబాద్​ స్టేషన్​లో ఆగి ఉన్న గూడ్స్​ రైలును గోరఖ్​పూర్​ వెళుతున్న గోరఖ్​ధామ్​ ఎక్స్​ప్రెస్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25మంది మరణించారు. 50మంది గాయపడ్డారు.

2015 మార్చ్​ 20:- డెహ్రాడూన్​ నుంచి వారణాసి వెళుతున్న జనతా ఎక్స్​ప్రెస్​.. ఉత్తర్​ ప్రదేశ్​ రాయ్​బరేలీలోని బచ్రవాన్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్​తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30మంది మరణించారు. 150మంది గాయపడ్డారు.

2016 నవంబర్​ 20:- కాన్పూర్​లోని పుఖ్రాయన్​కు సమీపంలో ఇండోర్​- పట్నా ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 150మంది గాయపడ్డారు.

 2017 ఆగస్ట్​ 19:- హరిద్వార్​ నుంచి పూరి వెళుతున్న కలింగ ఉత్కల్​ ఎక్స్​ప్రెస్​.. ఉత్తర్​ ప్రదేశ్​ ముజాఫర్​నగర్​లో ప్రమాదానికి గురైంది. 14 బోగీలు పట్టాలు తప్పాయి. 21మంది మరణించారు. 97మంది గాయపడ్డారు.

2017 ఆగస్ట్​ 23:- ఉత్తర్​ ప్రదేశ్​ ఔరియాకు సమీపంలో కైఫియత్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70మంది గాయపడ్డారు.

2022 జనవరి 13:- బికనీర్​- గౌహత ఎక్స్​ప్రెస్​కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ్​ బెంగాల్​ అలీపుర్​దౌర్​కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 9మంది మరణించారు. 36మంది గాయపడ్డారు.

2023 జూన్​ 2:- ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో (జూన్​ 3 ఉదయం 6 గంటల వరకు) మృతుల సంఖ్య 207కు చేరింది.

1981:- బిహార్‌లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది మరణించారు.

1995:- ఉత్తర్​ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద దిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌.. కలిండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది చనిపోయారు.

1999:- అసోంలోని గైసోల్‌ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 290 మంది మరణించారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించడటం సంచలనంగా మారింది.

1998:- కోల్‌కతా వెళుతున్న జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌.. ఖన్నా-లుథియానా సెక్షన్‌లో పట్టాలు తప్పిన.. గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

2002:- హౌరా నుంచి దిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 140 మంది చనిపోయారు.