ఒడిశాలో ఘోర రైలు ప్ర‌మాదం.. 230 మందికి పైగా మృతి!

 
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్ర‌మాదంలో 230 మందికి పైగా మృతి చెందిన్నట్లు, 900 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తున్నది.  బలేశ్వర్ దగ్గర బ‌హ‌నాగ స్టేష‌న్‌లో ఆగివున్న గూడ్స్ రైలును షాలిమార్- చెన్నై కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్  రాలుతో పాటు యశ్వంతపూర్ నుండి హౌరా వెడుతున్న మరోరైలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్న ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్  కు చెందిన 10 నుండి 12 కోచ్ లు, మరో రైలుకు చెందిన 3- 4 కోచ్ లు పట్టాలు తప్పాయి. క్ష‌త‌గాత్రుల‌ను సోరో, గోపాల్‌పూర్‌, ఖంట‌పాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు. క్షత‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చర్య‌ల్లో నిమగ్న‌మైంది. రైల్వే అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. బోగీల్లో ఇరుక్కున్న ప్ర‌యాణికుల‌ను బ‌య‌ట‌కు వెలికి తీస్తున్నారు. క్ష‌త‌గాత్రుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. గూడ్స్ రైలును ఢీకొన‌డంతో కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లోని 10కి పైగా  బోగీలు బోల్తా ప‌డ్డాయి. ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో రైల్వే పోలీసులు హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ప్ర‌క‌టించారు. 044-2535 4771, 67822 62286, బెంగాల్ హెల్ప్ లైన్ నంబ‌ర్లు – 033 – 2214 3526, 2253 5185.

 హౌరా నుంచి చెన్నయ్ వెళ్తున్న రైలు నెంబర్‌ 12841 కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం రాత్రి 7:08 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో బహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢకొీట్టింది. ఈ రైలులో జనరల్‌ 2, స్లీపర్‌ 5, థర్డ్‌ క్లాస్‌ ఎసి 9, సెకెండ్‌ క్లాస్‌ ఎసి 2, ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌లతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో 3 స్లీపర్‌ కోచ్‌లు మినహా 15 కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 1800 ప్రయాణికులు ఉన్నారని, ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉందని అధికారులు ప్రకటించారు. సిగల్‌ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చి ఢకొీన్నాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భారీగా ధ్వంసమైంది. కోచ్‌ల మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 60 అంబులెన్సుల సహాయంతో వైద్య సేవలు అందుతున్నాయి.

ఈ ప్రమాదం జరిగిన చోటనే యశ్వంత్‌పూర్‌ – హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా పట్టాలు తప్పింది. అప్పటికే ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో యశ్వంత్‌పూర్‌ – హౌరా ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన మూడు, నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారి అమితాబ్‌ శర్మ ఓ ఛానల్‌కు వెల్లడించారు.

ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వేడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్వని  వైష్ణవ తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహితం శనివారం ఉదయం అక్కడకు చేరుకోనున్నట్లు ప్రకటించారు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది.

ఈ ప్రమాదం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే మంత్రితో మాట్లాడినట్లు, అవసరమైన సహాయక చర్యలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు.