రైలుప్రమాదంలో ఉగ్ర కోణం?.. మమతా!

ఒడిశా రైలు ప్రమాదంలో ఉగ్రకోణం ఉండే అవకాశాలున్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు.  దీనిపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆమె స్పష్టం చేశారు.  ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని తెలిపారు. 
ఒడిశా రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆమె నేడు కోల్ కతా నుంచి బాలసోర్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు.  అక్కడ అధికారుల నుంచి ప్రమాద ఘటన గురించి మమతా బెనర్జీ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు.  వారందరికీ మెరుగైన వైద్యసేవలందించాలని స్థానిక అధికారులను అభ్యర్థించారు.
 
ఈ ప్రమాదంలో మరణించిన వారిలోనూ, క్షతగాత్రులలోనూ అత్యధికులు బెంగాలీలే కావడంతో మమత తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.   రైలు ప్రమాదంలో మరణించిన  రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున  ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలను  ప్రకటించారు.  ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎంఓ ట్వీ్ట్ చేసింది.    అలాగే బెంగాలీలకు చెందిన మృతదేహాలను సత్వరం వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఒడిశా ముఖ్యమంత్రిని ఆమె కోరారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం  ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
మరణించిన ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి తరుపున రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది.