తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో బిజెపి నిర్ణయాత్మక పాత్ర

* తెలంగాణ రాష్త్ర అవతరణ దినోత్సవం
 
కోట్లాది మంది తెలంగాణ ప్రజల సుదీర్ఘకాలం పోరాటాలు, కలలు, అభిలాషలకు కార్యరూపం దాల్చే విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంలో నిర్ణయాత్మక పాత్ర వహించింది బీజేపీ మాత్రమే.  మొదటగా `ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తీర్మానం చేసిన రాజకీయ పార్టీ బిజెపి కావడం తెలిసిందే.
 
ఆ తర్వాత ప్రతి దశలో బిజెపి జరిపిన పోరాటం, అందిస్తున్న మద్దతు కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చి, నేడు 10వ వార్షికోత్సవం చేరుకోగలుగుతున్నాం.  వాస్తవానికి ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదు.
 
తెలంగాణ ఏర్పాటు నినాదంపై ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసుకొని, ఉద్యమాలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుండి అడ్డంకిగా అంటూ వస్తున్న కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామి అయ్యారు. తాను స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
అయితే, కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఏనాడూ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పట్టుబట్టిన దాఖలాలు లేవు.  కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అంటూ వేసి, అభిప్రాయం సేకరణ పేరుతో కాలయాపనం చేస్తూ వచ్చింది. ఆ సమయంలో బిజెపి అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్టీ మద్దతును ప్రకటించారు. పార్లమెంట్ లో ఆ మేరకు యుపిఎ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే బిజెపి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
 
యుపిఎ ప్రభుత్వం అటువంటి బిల్లు తీసుకురాని పక్షంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాగానే  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, బీజేపీ పక్ష నాయకురాలు సుష్మ స్వరాజ్ నేరుగా లోక్ సభలోనే ఈ విషయమై నాటి యుపిఎ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. “మీరు తెలంగాణ ఏర్పాటుకు బిల్లును ఇక్కడ తీసుకు వస్తారా? వచ్చే ఎన్నికల తర్వాత మా ప్రభుత్వాన్ని తీసుకు రమ్మంటారా?” అంటూ నిలదీశారు.
 
బిజెపి జాతీయ స్థాయిలో మద్దతు ఇచ్చిన తర్వాతనే నాటి యుపిఎ ప్రభుత్వంకు తెలంగాణ ఏర్పాటుకు బిల్లు తీసుకు రాకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. లేని పక్షంలో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అని భయపడ్డారు. పైగా, టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ నుండి మాట తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ ఈ విషయంలో ముందడుగు వేయడం గమనార్హం.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమని, రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ పాల్గొనని ఉద్యమమే లేదని  కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ తీర్మానం మొదలు రాష్ట్ర సాధన వరకు, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. పార్లమెంటులోనూ సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ నాటి అధికార కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ బిల్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో తాను నిరవధిక దీక్ష చేసిన విషయాన్నీ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

కేంద్ర మంత్రిగా ఉంటూ కేసీఆర్ ఏనాడూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం యుపిఎ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. పైగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీని నియమించి ఈ అంశాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే, తెలంగాణ అంశంపై తాడో పేడో తేల్చుకోవాలని నాటి మరో టిఆర్ఎస్ మంత్రి ఎ నరేంద్ర పట్టుబట్టడంతో కేసీఆర్ అయిష్టంగానే కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసి బైటకు వచ్చారు.
 
ఆ సమయంలో తెలంగాణకు మద్దతుగా నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చేపట్టిన యాత్రకు తెలంగాణాలో అనూహ్య ప్రజామద్దతు లభించింది. ఈ యాత్రతో కేసీఆర్ ఖంగు తిన్నారు.  తెలంగాణ కోసం ఉమ్మడిగా పోరాటాం చేసేందుకు రాజకీయ జేఏసీ ఏర్పాటులో సహితం ప్రత్యేక రాష్ట్ర విభజనకు అడ్డంకిగా మారిన కాంగ్రెస్ నేత కె జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా బిజెపి అడ్డు చెప్పడంతో కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు జరిగింది.
 
అయితే, రాజకీయ జేఏసీ నుండి ఒకొక్క రాజకీయ పార్టీని కోదండరాంతో చేతులు కలిపి కేసీఆర్ వ్యూహాత్మకంగా బయటకు నెట్టేశారు. తెలంగాణ ఉదయం అంటే తానే అనే ప్రచారంకోసం ప్రయత్నం చేశారు. కానీ, బిజెపి నాటు అందించిన అరమరికలు లేని మద్దతు కారణంగా కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం తలవంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధపడక తప్పలేదు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేపని కాదనే సంకేతం కేంద్రంలోని ప్రణబ్ ముఖర్జీ వంటి మంత్రులు ఇవ్వడంతోనే నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టారు. చివరి వరకు విభజనను అడ్డుకొనే ప్రయత్నం ఏపీలోని కాంగ్రెస్ నాయకులు చేశారు.
 
`సమైక్యాంధ్ర ఉద్యమం’ అంటూ ఒక కుత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. ఇంతగా రగడ జరుగుతున్నా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగి, వారిని వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.  కాంగ్రెస్ విద్రోహకార విధానాలకు కేసీఆర్ ఎప్పుడు అండగా ఉంటూ వచ్చారు.  అయితే ఈ విషయంలో బిజెపి రాజీలేని వైఖరి అనుసరించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక తప్పలేదు.
 
అయితే, గతంలో వాజపేయి ప్రభుత్వం ఎటువంటి వివాదాలు, సమస్యలు లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. కానీ కాంగ్రెస్, కేసీఆర్ కలిసి అన్యమనస్కంగా రాష్ట్ర విభజన జరపడంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఎన్నో అపోహాలు, వివాదాలు రగిల్చే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత అయినా వైమష్యాలు మరచి అభివృద్ధివైపు దృష్టి సారించకుండా `తెలంగాణ సెంటిమెంట్’ ను రాజకీయ అస్త్రంగా చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
 
అయితే, అయిష్టంగానే అందుకు బిల్లు తీసుకు వచ్చి, అందులో అనేక లొసుగులు ఉండేవిధంగా చూడడంతో తొమ్మిదేళ్లయినా విభజన సందర్భంగా ఏర్పడిన సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవ తీసుకొని అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలు కూడబలుక్కొని కలసి రాకపోవడంతో పరిష్కారం సాధ్యం కావడం లేదు.
 
జలవివాదాలు అయితే, ఆస్తుల పంపకం అయితే, ఉద్యోగుల విభజన అయితే – కేసీఆర్ అనుసరిస్తున్న ద్వంద వైఖరి కారణంగా  పరిష్కారం నోచుకోవడం లేదు. ఈ సమస్యలను సాకుగా తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లభ్ది పొందే ప్రయత్నం చేయడమే గాని, తెలంగాణ ప్రజల సమగ్రాభివృద్ధి పట్ల శ్రద్ద చూపడం లేదు.