ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిన తెలంగాణ

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందని కేంద్ర మంత్రి జి  కిషన్ రెడ్డి విమర్శించారు.  గోల్కొండకోటలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కిషన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిపోయిందని ఆరోపించారు. ప్రజలు ఒకసారి  ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు.

తెలంగాణ దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందని చెబుతూ  ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ధరణి మాఫియా, సాండ్ మాఫియా, దళితబంధులో మాఫియా, కాంట్రాక్టుల్లో మాఫియా, ఎక్కడ చూసినా మాఫియానే అని ఆరోపించారు. భూ దందా కోసమే 111జీవో రద్దు చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాలే కానీ బంగారు కుటుంబాలు అయ్యాయని ధ్వజమెత్తారు.

రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెబుతూ అప్పుల కోసమా తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు.  అప్పులు చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోతుందని పేర్కొంటూ ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. బ్యాంకుల నుంచే రూ. లక్షా 30 వేల కోట్ల అప్పు తీసుకుందని,  కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో హామీలు అమలు కావడం లేదని చెబుతూ  కేజీ టూ పీజీ, గిరిజన రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.  చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఫామ్ హౌజ్ లు పెరుగుతున్నయ్ కానీ పేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించడం లేదని మండిపడ్డారు.

ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ ఎక్కడా? అని ప్రశ్నించారు. ఉన్న హాస్పిటల్స్ మూసేశారని, ఉస్మానియా వర్షం నీటితో ఉరుస్తుందని దయ్యబట్టారు. అన్ని పదవులు ఉద్యమ ద్రోహులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలపై సంకెళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్రటేరియేట్ కు రాని కేసీఆర్ కు సెక్రటేరియట్ ఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియట్ ఎందుకు కట్టారని నిలదీశారు.

ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదని, తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో గట్టిగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని అంటూ 1200 మంది అమరులయ్యారని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగిందని పేర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెబుతూ   ఆ నాడు జేఏసీలో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. పార్లమెంట్ లో రాష్ట్ర బిల్లు పాస్ చేయడంలో ప్రతిపక్ష పార్టీగా  బీజేపీ పాత్ర పోషించిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి ఇప్పటికే అనేక విధాలుగా నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. నిన్నటికి నిన్న తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ పాస్ట్ రైల్వే ట్రాక్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్‌లు తొలగిస్తే గిరిజనులకు చట్టపరమైన రిజర్వేషన్‌లు అమలవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.