తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప‌దవ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము త‌న ట్విట్ట‌ర్‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్ తెలుపుతూ రాష్ట్రంలో అడువులు, వన్య‌ప్రాణులు సుసంప‌న్నంగా ఉన్న‌ట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో నైపుణ్య‌వంత‌మైన ప్ర‌జ‌లు ఉన్నార‌ని, రాష్ట్ర సాంస్కృతిక వార‌స‌త్వం కూడా సంప‌న్న‌మైంద‌ని ఆమె పేర్కొన్నారు. అద్భుత‌మైన తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కేంద్రంగా మారుతున్న‌ట్లు ముర్ము త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనునిత్యం ప్ర‌గ‌తిప‌థంలో ముందుకు సాగాల‌ని ఆమె బెస్ట్ విషెస్ తెలిపారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. తెలంగాణ ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభం ఎంతో గుర్తింపు పొందాయని కొనియాడారు. అద్భుత‌మైన తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్‌ను పలువురు రీట్విట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వీరులకు జోహార్లు తెలిపిన గవర్నర్ తమిళసై.. ఉద్యమకారులకు సన్మానం చేశారు. జై తెలంగాణ అనేది ఆత్మగౌరవ నినాదమని ఈ సందర్బంగా తెలిపారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. తన జీవితంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చింది.

తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం కాదని,  తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు.