జనంలోకి మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన విజయాలు!

కేంద్రంలో మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో సాధించిన ప్రగతిని రిపోర్ట్‌ కార్డు రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రజల మద్దతు కూడగట్టేందుకు నెల రోజుల పాటు ‘మహా జనసంపర్క్‌ అభియాన్‌’ నిర్వహించనుంది.
 
తొమ్మిదేళ్ల పాలనలో తాము తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలు మెరుగు పరచడానికేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ మంగళవారం ట్విటర్‌లో భావోద్వేగమైన పోస్టును ఉంచారు.
 
 ‘ఈరోజుతో మనం దేశానికి తొమ్మిదేళ్ల సేవ పూర్తి చేసుకున్నాం. నా హృదయం వినయం, కృతజ్ఞతతో నిండి ఉంది. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి చర్య ప్రజల జీవితాలు మెరుగుపరచాలనే ఆకాంక్షతో మార్గనిర్దేశం చేసినవే. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఇంతకంటే బాగా కష్టపడి పనిచేద్దాం’ అని ట్వీట్‌ చేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్‌ చిత్రాలనూ దీనికి జోడించారు.
 
‘‘తొమ్మిదేళ్ల బీజేపీ పాలన.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’’ పేరుతో మే 31 నుంచి జూన్‌ 30 వరకు దేశ వ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని బిజెపి నేతలు ప్రకటించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.  ఇందులో భాగంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ వెయ్యి మంది ప్రముఖులను కలవనున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ వెయ్యిమంది ప్రముఖులతో కూడిన జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో తమ సేవల ద్వారా పద్మ అవార్డులు, రాష్ట్రపతి మెడల్స్‌ పొందినవారు ఉన్నారు.
 
ఇలా దేశంలోని 543 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 5.5 లక్షల మందిని కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు కలువనున్నారు. మోదీ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన పురోగతిని వారికి వివరిస్తారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాలలో పూర్తయిన, లేదా చేపట్టిన అభివృద్ధి పనులనూ వారికి తెలియజేస్తారు. దీంతోపాటు పూర్తయిన జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల వద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
 
జూన్ 3 నుంచి జూన్ 30 వరకు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేయనున్నారు. యువత, మహిళలు ఇలా అన్ని రంగాల ప్రజలను కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ నిర్వహిస్తామని, 16 లక్షల మంది కార్యకర్తలతో నేరుగా ప్రజలతో మమేకం అవుతామని చెబుతున్నారు. వచ్చే నెల రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరినీ కలుసుకుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తెలిపారు.
 
మోదీ 12 ర్యాలీలు నిర్వహిస్తారని, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మోదీ సహా సీనియర్‌ నేతలు దేశవ్యాప్తంగా మొత్తం 51 ర్యాలీలు నిర్వహించనున్నట్టు కార్యక్రమ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ చెప్పారు.
 
దీంతోపాటు పార్టీ నేతలను ప్రజలతో కలిపేందుకు మోదీ ‘డిజిటల్‌ ర్యాలీ’లు కూడా నిర్వహించనున్నారు. మొత్తం 500 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా మొత్తం 543 నియోజకవర్గాలను 144 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌లోనూ మంత్రులు సహా ఇద్దరు సీనియర్‌ నేతలు ఎనిమిది రోజులు గడిపేలా ప్రణాళిక రూపొందించారు.
 
బీజేపీ 9 ఏళ్ల పాలనను సమర్ధించేవారు మిస్ కాల్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా నెంబర్ (9090902024) ను ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన రోజు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రతి ఎంపీ తన సొంత నియోజకవర్గం కాకుండా తనకి కేటాయించిన నియోజకవర్గంలో కనీసం 8 రోజులు పని చేయాల్సి ఉంటుందని తరుణ్ చుగ్ చెప్పారు. మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని, కేంద్రం రూపాయి పంపిస్తే ప్రజలకు పూర్తి రూపాయి అందుతుందని చెప్పారు.