భారత్ పై ఛైనా సానుకూలత .. అమెరికాపై మండిపాటు!

భారత దేశం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించుకోవడాన్ని  స్వాగతిస్తూ భారత్ – చైనాల మధ్య అగాధం సృష్టించేందుకు అగ్రరాజ్యం అమెరికా, పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు అంటూ చైనా మండిపడింది. ఇటీవలనే జపాన్లోని హిరోషిమాలో జరిగిన జి 7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కొద్దీ రోజులలో అమెరికా పర్యటనకు వెడుతున్న సందర్భంగా చైనా చేసిన ఈ వాఖ్యలు ప్రాధాన్యతను సంతరింప చేసుకున్నాయి.

అదే సమయంలో ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భారత్ కు 60,000 వీసాలు జారీచేశామని పేర్కొనడం ద్వారా భారత్ పట్ల తామెంతో సామరస్యంగా ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికలో భారత్ నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని “గొప్ప చిహ్నం”గా అభివర్ణించింది.

ఇది “భారత రాజధానిని వలస పాలన జాడల నుండి విముక్తం చేసే లక్ష్యంతో ఉంది” అంటూ ప్రశంసించింది. భారతదేశపు “పెరుగుతున్న” ప్రపంచ స్థాయి నుండి జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, పేదలకు గృహాలు, మరుగుదొడ్లు వంటి సంక్షేమ చర్యలు, పైపుల ద్వారా నీటి సరఫరాకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల పెరుగుదల, తయారీ రంగాన్ని పెంచే ప్రయత్నాలు వంటి వాటిని కూడా ఉదాహరించింది.

 ఒక విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తింది. వలసవాద చరిత్రతో ముడిపడి ఉన్న బడ్జెట్ పద్ధతులను మార్చడం, ఆంగ్ల భాష అధికారిక వినియోగాన్ని తగ్గించడం, హిందీ భాష వినియోగాన్ని పెంచడం వంటి అనేక చర్యలను ప్రస్తావించింది. చివరగా,  “జాతీయ గౌరవాన్ని నిలబెట్టడానికి, మరింత స్వతంత్రంగా వ్యవహరించాలనే  భారతదేశ కోరికతో చైనా స్పష్టంగా సానుభూతి వ్యక్తపరుస్తుంది” అంటూ పేర్కొన్నది.

అయితే, భారతదేశంలో  ప్రముఖులు పాశ్చాత్యుల ప్రభావానికి గురవుతున్నారని తన అక్కసును వ్యక్తం చేసింది.  “భారతదేశం కోసం, అత్యంత సవాలుగా ఉన్న భాగం ముందుకు ఉంది – సంస్కృతి, ప్రజల హృదయాల నుండి వలసవాద అవశేషాలను తొలగించడం.  ఇది పేర్లను మార్చడం లేదా లేబుల్‌లను తొలగించడం కంటే నిస్సందేహంగా చాలా కష్టం” అని పేర్కొంది.

ఈ కథనానికి అనుగుణంగా, ఢిల్లీ లోని చైనా రాయబార కార్యాలయం వీసాల జారీ గురించి ప్రకటన జారీ చేసింది. “ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో, చైనా రాయబార కార్యాలయం , కాన్సులేట్ జనరల్ వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పని, కుటుంబ ప్రయోజనాల కోసం చైనాకు వెళ్లే భారతీయులకు 60,000 వీసాలను జారీ చేసింది. చైనాకు స్వాగతం.”

ఈ సందర్భంగా రాయబార కార్యాలయ ప్రతినిధి వాంగ్ జియోజియాన్ గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించిన అంశాలను విస్తరించే ప్రయత్నం చేశారు.   “ఇప్పుడు, పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పెద్ద ఎత్తున “విభజించి పాలించు” అనే రహస్య రూపాన్ని మరింత విస్తృతస్థాయిలో  ప్రయత్నిస్తాయి. వారు “డ్రాగన్-ఏనుగు పోటీ” అనే భావనను రూపొందించారు.  చైనా, భారతదేశం మధ్య మానసిక ఘర్షణలను పెంపొందించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు” అని ఆరోపించారు.

అయితే, గ్లోబల్ టైమ్స్ కథనంలో గాని, ఢిల్లీలోని చైనా మిషన్ ప్రకటనలో గాని సరిహద్దు వివాదం గురించి, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తల గురించి మాటమాత్రమైనా ప్రస్తావించక పోవడం గమనార్హం.