కేసీఆర్ కు ఒవైసీ బెదిరింపులు వ్యూహాత్మకమా!

తెలంగాణాలో బిఆర్ఎస్ కు `అనధికార మిత్రపక్షం’గా పేరొందిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ లో ఓ బహిరంగ సభలో కేసీఆర్ సర్కారు తీరును తూర్పారాపట్టడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది. రాజకీయంగా వ్యూహాత్మకంగా చేసిన వాఖ్యాలుగా పలువురు భావిస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒవైసి నడిపిస్తున్నది అంటూ నిత్యం బిజెపి విమర్శలు గుప్పిస్తున్నది. ఒవైసి కనుసన్నలలో కేసీఆర్ పాలన సాగుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నది. అయితే ఈ ఆరోపణలను ఇప్పటివరకు బిఆర్ఎస్ నేతలు గాని, ఎంఐఎం నేతలు గాని తీవ్రంగా తిప్పికొట్టిన సందర్భాలు లేవు.

అటువంటిది, కేసీఆర్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం పనిచేయడం లేదని, రూ. 1200 కోట్లు ఖర్చు చేసి యాదాద్రి ఆలయాన్ని, బ్రాహ్మణ సదన్ కట్టిన కేసీఆర్  ఇస్లామిక్ సెంటర్ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించడం విస్మయం కలిగిస్తోంది. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదని, సెక్రటేరియట్ పూర్తి చేసినా అందులో మసీదు విషయాన్ని గాలి కొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం బిజెపి ప్రభావం ప్రభావంలో పడి హిందువులంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటువేసి పరిస్థితులు ఏర్పడకుండా చేయడం కోసమే ఒవైసీ ఈ విధంగా మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పటి వరకు తమ ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారని, అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించడమా కూడా అటువంటి వ్యూహంలో  భాగమయ్యే అవకాశంగా కనిపిస్తున్నది.

గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుతాలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొంటున్న ఒవైసి పాతబస్తీలో ఆయా పార్టీలు బలమైన హిందూ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా, వారి ఓట్లను చీల్చి, తమ పార్టీ అభ్యర్థులు సునాయాణంగా గెలుపొందేటలంటూ చేసుకొంటున్నారు.  ప్రతిగా హైదరాబాద్ నగరంలో మిగిలిన నియోజకవర్గాలలో, తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కడా అభ్యర్థులను నిలబెట్టడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో ముస్లింలు వారికి ఓటువేసి విధంగా సహకారం అందిస్తున్నారు.

హైదరాబాద్ లో పాతబస్తీకే పరిమితమైనా, ఎంఐఎం మహారాష్ట్ర, యూపీ, బిహార్ లలో పోటీ చేసి పలుచోట్ల విజయం సాధించడం గమనార్హం. అయితే,  పాత నగరంలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం ఈ సారి గ్రేటర్ బయట నియోజకవర్గాలలో పోటీచేసేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు వదులుతున్నారు. కేవలం కేసీఆర్ ను బెదిరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? మరేదైనా వ్యూహం ఉందా? తెలియవలసి ఉంది.

తమకు ఓటు బ్యాంకు ఉన్న జూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​, అంబర్​ పేట్​, ముథోల్​, నిర్మల్​, ఆదిలాబాద్​, ఖానాపూర్, నిజామాబాద్​, కామారెడ్డి, బోధన్​, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్​ నగర్​, వరంగల్​ ఈస్ట్​, ఖమ్మం సహా పలు నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. కనీసం 30 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను నిలిపే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, కర్ణాటకలో మాదిరిగా ముస్లిం ఓటర్లను గంపగుత్తుగా పొందేందుకు కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? వాటిని తిప్పికొట్టేందుకు ఒవైసి ఇటువంటి వ్యూహం అనుసరిస్తున్నారా? తెలియవలసి ఉంది.