దేశంలో చలామణిలో 77 శాతం నోట్లు రూ 500 నోట్లే

దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు కాగా,  దేశంలోని మొత్తం నోట్లలో  77 శాతం షేర్ రూ. 500 నోట్లదే కావడం గమనార్హం.  దేశంలో కరెన్సీ నోట్ల వినియోగానికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాలు తెలిసాయి.
అంతేకాకుండా, దేశంలో నకిలీ నోట్లలో కూడా అందరూ అనుకున్నట్లు రూ 2,000 నోట్లు కాకుండా రూ 500 నోట్లే ఎక్కువగా ఉన్నాయి.
2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది.   భారతదేశంలో కరెన్సీ వినియోగం 4.4 శాతం పెరిగి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 13,621 కోట్ల నోట్లు చలామణీలోకి వచ్చాయని ఆర్బీఐ నివేదిక  పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో  దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. , అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.
 
 ఆ తర్వాత దేశంలో ఎక్కువగా చెల్లుబాటులో ఉన్న కరెన్సీగా 10 రూపాయల నోట్లు నిలిచాయి. 2,621 కోట్ల పది రూపాయల నోట్లు మన దేశంలో చలామణీలో ఉన్నాయని, 1,805 కోట్ల 100 రూపాయల నోట్లు భారత్‌లో వినియోగంలో ఉన్నాయని ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది.
మొత్తం కరెన్సీ విలువ 33.48 లక్షల కోట్ల రూపాయలు కాగా.. అందులో 77 శాతం షేర్ 500 నోట్లదే.
 
మార్చి 31, 2023 సమయానికి ఆర్బీఐ అధికారిక గణాంకాల ప్రకారం వినియోగంలో ఉన్న మొత్తం డబ్బులో 500, 2000 నోట్ల విలువ 87.9 శాతంగా ఉంది. 200 నోట్ల రూపాయలు కూడా 4.6 శాతం పెరుగుదలతో 626 కోట్ల నోట్లు దేశంలో చలామణీలో ఉన్నాయి.ఏడేళ్ల క్రితం కేంద్రం 1000, 500 రూపాయల నోట్లను వాడకం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మనుగడలో వున్న రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించింది. ఐదు నెలల పాటు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రోజుకు రూ.20 వేలకు తగ్గకుండా రెండు వేల నోట్లను మార్చుకోవచ్చంటూ కస్టమర్లకు అవకాశం ఇచ్చింది.
కాగా, గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నకిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు  ఆర్బీఐ పేర్కొంది. ఇక అదే సంవ‌త్స‌ర కాలంలో రూ.2000 నోట్లలో కేవ‌లం 9806 నోట్లు మాత్ర‌మే న‌కిలీవేని వెల్ల‌డించింది. రూ.20కు చెందిన నోట్ల‌ల్లో కూడా 8.4 శాతం నోట్లు న‌కిలీవి దొరికిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదికలో తెలిపింది.
ఇక రూ.10, రూ.1, రూ.2000 నోట్ల‌ల్లో న‌కిలీలు 11.6 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆర్బీఐ పేర్కొన్న‌ది. ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సీ నోట్స్ ప్ర‌కారం 2022-23లో 2,25,769 నకిలీ నోట్లు రాగా, అంత‌కుముందు ఏడాది 2,30,971 న‌కిలీ నోట్లు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో తెలిపింది. నకిలీ నోట్ల‌లో 4.6 శాతం నోట్ల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ గుర్తించ‌గా, ఇత‌ర బ్యాంకులు 95.4 శాతం నోట్ల‌ను గుర్తించాయి.