అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో శాంతిని పునరుద్ధరిస్తాం

అల్లర్లు, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. పరిస్థితిని సమీక్షించేందుకు పౌర సంస్థలు, మహిళా నేతల బృందంతో మంగళవారంనాడు ఆయన సమావేశమయ్యారు.
 
సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు, అభ్యుదయ పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.  కల్లోలిత మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగా మైతి, కుకీ వర్గాల ప్రతినిధులతో అమిత్‌షా మంగళవారంనాడు సమావేశం కానున్నారు.
 
“మణిపూర్‌లో మహిళా నేతల బృందం (మీరా పైబీ)తో సమావేశం నిర్వహించారు. మణిపూర్ సమాజంలో మహిళల పాత్ర ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సును నిర్ధారించడానికి మేము కలిసి కట్టుబడి ఉన్నాము” అని అమిత్ షా ట్వీట్ చేశారు.
 
నాలుగు రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా సోమవారంనాడు ఇంఫాల్ చేరుకున్న హోం మంత్రి ఆ వెంటనే ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇంతవరకు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు.
 
పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన పలువురు కుకీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయనతో చర్చలకు వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కుకీలు తాము నివసించే జిల్లాలకు ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్నారు. విఫలమైతే వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
 
మణిపూర్‌లో సరఫరాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సమావేశం నిర్ణయించింది. హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
 
అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. మృతుల కుటుంబ సభ్యునికి కూడా ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. పరిహారం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం సమానంగా భరిస్తాయి. సోమవారం అర్థరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
అంతేకాకుండా, పుకార్లను తొలగించేందుకు ప్రత్యేక టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేస్తారు. పెట్రోల్, ఎల్‌పిజి గ్యాస్, బియ్యం, ఇతర ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించడానికి పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని అమిత్ షా జరిపిన సమావేశం నిర్ణయించింది.
 
ఇలా ఉండగా,  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. మణిపూర్‌లో పరిస్థితిపై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు. “సుప్రీంకోర్టులో పనిచేస్తున్న లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో సహా 12 డిమాండ్లను మేము ఆమె ముందుకు తెచ్చాము” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. కాగా, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుగూ, మణిపూర్‌లో తలెత్తిన సవాళ్లు ఇంకా సమసిపోలేదని, సమస్యలు పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఇయితే ఈ ఘటనలు తిరుగుబాటుకు సంబంధించిన ఘటనలు కావని తెలిపారు.

మే 3న మైతీ, కుకీ తెగల మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారారు. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లు విడిచిపెట్టి సహాయక శిబిరాలకు తరలివెళ్లారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలు కొద్దికాలంగా రాజధాని నగరంలోనూ, అల్లర్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ మోహరించాయి.