పేరుకే రూ 75 నాణెం.. ధర వేలలో ఉండే అవకాశం!

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ముద్రించిన రూ 75 నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.  అయితే అది పేరుకే రూ 75 నాణెం అయినప్పటికీ ఆ ధరలో అందుబాటులో ఉండదని తెలుస్తున్నది. దానిని కొనాలంటే కొన్ని వేల రూపాయలను వెచ్చిపవలసి ఉంటుందని చెబుతున్నారు.
 
ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జ్ఞాపికలుగా రూపొందించే ఈ నాణేలు సాధారణంగా మార్కెట్లో చెలామణిలో ఉండవు. వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. 1964 నుంచి ఇప్పటివరకు మొత్తం 150 ప్రత్యేక నాణేలను తయారు చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఇంకా దీని ధరను ప్రకటించలేదు.
అయితే, ఈ రూ. 75 నాణేన్ని తయారు చేసేందుకు 50 శాతం వెండి, 40 శాతం కాపర్, 5 శాతం నికేల్, 5 శాతం జింక్ ను ఉపయోగించారని వెల్లడించారు.  మార్కెట్ లో ఈ ముడి పదార్థాలు ధర రూ 1300 వరకు ఉంటుందని బంగారు ఆభరణాల వ్యాపారాలు చెబుతున్నారు.
 
ఈ నాణెం బరువు 34.65 నుంచి 35.65 గ్రాముల వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది.  ఈ నాణేనికి ఒక వైపు జాతీయ చిహ్నం, దేవనాగరి లిఫిలో రాసిన భారత్ అనే పదంతో పాటు ఆంగ్లంలో ఇండియా అని రాసి ఉంటుంది. మరో వైపు నూతన పార్లమెంటు కాంప్లెక్స్ చిత్రంతో పాటు 2023 అని ముద్రించి ఉంటుంది .
 
కేంద్రం ప్రత్యేకంగా తయారు చేయించే ఈ నాణేలును www.indiagovtmint.in అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా డీడీ ద్వారా వీటిని కొనే వీలుంటుంది. నగదు, చెక్ ద్వారా కొనేందుకు అనుమతించరు. అలాగే ఎవరైనా10 నాణేల కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటే పాన్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది.
 
కాగా ఇప్పటివరకు కేంద్ర ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికల్లో రూ.100 నాణెం అత్యధిక ధర పలికింది. ప్రసిద్ధ భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జే బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన‌ రూ.100 నాణెం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.18,561 గా నిర్ణయించారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ 150వ జయంతి సందర్భంగా రూపొందించిన రూ.150 నాణెం ధర రూ.10,890 గా ఉంది. మరి రూ.75 నాణెం ధరను కేంద్రం ఎంతగా నిర్ణయిస్తుందో  చూడాల్సి ఉంది.