లంచం ఇచ్చారన్న ఆరోపణలపై రోల్స్ రాయిస్ పై సీబీఐ కేసు

శిక్షణ విమానాల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటీష్ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ రోల్స్ రాయిస్, ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల కోసం హాక్ 115 అడ్వాన్స్ జెట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్ తోపాటు మధ్యవర్తులు సుధీర్ చౌదరి, భాను చౌదరి, రోల్స్ రాయిస్ పీఎల్సీ, బ్రిటీష్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, 24 హాక్ 115 ఏజీటీల కొనుగోళ్లకు భారత్ రోల్స్ రాయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 734.21 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు.

అలాగే 42 ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి గానూ హిందుస్థాన్ ఎరోనాటిక్స్‌(హెచ్ ఎ ఎల్)కు మెటీరియల్ సప్లై చేయడానికి 308.247 మిలియన్ డాలర్లు, లైసెన్స్ ఫీజు కింద మరో 7.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డీల్ కుదిరింది.  అయితే, ఈ డీల్ పూర్తవ్వడానికి గానూ నిందితులు పలువురు ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ డీల్ నిలిచిపోయింది.

దీనిపై 2016లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆరేళ్ల తర్వాత తాజాగా కేసు నమోదు చేసింది.  2006-07 మధ్య రోల్స్ రాయిస్ ఇండియా కార్యాలయాలపై ఐటీ శాఖ సర్వే నిర్వహించిన్పుడు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు బయటపడ్డాయని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అయితే, దర్యాప్తు నుంచి తప్పుకునేందుకు ఆ ఆధారాలను నిందితులు ధ్వంసం చేశారని వెల్లడించింది.

మరోవైపు, రోల్స్ రాయిస్ కంపెనీ పన్ను వ్యవహారలపై విచారణను అడ్డుకునేందుకు ఆదాయపు పన్ను అధికారులకు కూడా లంచాలు ఇచ్చిందని యూకే ఎన్పీవో విచారణలో వెల్లడైంది. కాగా, యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యాతో రక్షణ ఒప్పందాలకు సంబంధించి సుధీర్ చౌదరితో సంబంధమున్న పోర్ట్స్ మౌత్ అనే కంపెనీ పేరిట స్విస్ బ్యాంక్ ఖాతాలో రష్యా ఆయుధ కంపెనీలు 100 మిలియన్ల జీబీపీని డిపాజిట్లు చేసినట్లు విచారణలో తేలింది.