మణిపూర్ ఎన్‌కౌంటర్లలో 40 మంది హతం

మణిపూర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్‌లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి ఘర్షణల నడుమనే మణిపూర్‌లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతూ పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ సమాచారం నిర్థారణ చేసుకుని పోలీసు కమాండోల బృందం ఆదివారం రాష్ట్రంలోని నలు మూలాల పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టింది.
 
ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్‌కౌంటర్లు జరిగినట్లు, నిరాయుధులైన పౌరులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న 40 మంది తిరుగుబాటు దారులు ఎన్‌కౌంటర్లలో హతమైనట్లు తనకు సమాచారం అందిందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు.  ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయతోపాటు మరో 5 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ చేపట్టారు.
అత్యాధునిక ఆయుధాలతో పౌరులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రజలు కూడా చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎం-16, ఎకె 47, స్నైపర్‌ తుపాకులతో నిరాయుధులైన సాధారణ ప్రజలపై దాడులు జరిపే వారిని తిరుగుబాటుదారులుగా పరిగనింపలేమని, అటువంటి వారు ఉగ్రవాదులే అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
 
ఇంఫాల్ లోయ దాని చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రాంతాలపై తిరుగుబాటు దారులు ఒకేసారి దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మాయ్, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెక్మాయ్ వద్ద కాల్పులు ముగిశాయని.. సంబంధిత వర్గాలు తెలిపాయి.

తిరుగుబాటుదరుల మారణకాండను అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 8 గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి 40 మంది తిరుగుబాటు దారులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు.
గ్రామాల్లోని ఇళ్లను తగలబెట్టేందుకు ఆ మూకలు ప్రయత్నించాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, సైన్యం సాయంతో వారిని మట్టుబెట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు.
 
గాయపడిన పౌరులను రాజధాని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫాయెంగ్‌ ప్రాతంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.  బిషెన్‌పూర్‌లోని చందోన్‌పోక్పిలో జరిగిన కాల్పుల్లో ఓ రైతు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అతని మృతదేహాన్ని ఇంఫాల్ లోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో మరింత మంది పౌరులు చనిపోయినట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను పాటించాలని, పరిస్థితిని సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఇప్పటికే కుకీ తెగకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శనివారం రెండు రోజుల పర్యటనకై అక్కడికి చేరుకున్నారు.
 
తాజా అల్లర్లతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కర్ఫ్యూను ప్రభుత్వం మరింత కుదించింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్వూ సడలింపు ఇప్పటి వరకు ఉండగా.. ఆదివారం దాన్ని ఉదయం 11.30 గంటలకే తగ్గించింది. బిష్ణుపూర్‌లో కర్ఫ్యూ సడలింపు మధ్యాహ్నం 12 గంటల వరకు తగ్గింది.