లోక్‌సభ ఎన్నికలకు ముందు జనాభా గణన ఉండబోదు!

కరోనా మహమ్మారి కారణంగా నిరవధిక కాలానికి వాయిదా వేసిన దశాబ్ద జనాభా గణన 2024 ఏప్రిల్‌మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం లేదని అధికారవర్గాలు తెలిపాయి. జనాభా గణనలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, వినియోగించే తృణధాన్యాలు వంటి వాటికి సంబంధించి 31 ప్రశ్నలను అడుగుతారు.

 జనాభా గణన ఎప్పుడు జరిగినా వీటి గురించి అడుగుతారు. హౌస్ లిస్టింగ్ దశ, నేషనల్ పాపులేషన్ రిజిష్టర్(ఎన్‌పిఆర్) అప్‌డేట్ 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉండగా కరోనా .  వ్యాప్తి కారణంగా అది వాయిదా పడింది. జనాభా గణన నిర్వహణ నిలిపి ఉంచారు. ప్రభుత్వం ఇప్పటికీ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించలేదు. జనాభా గణనకు ఎన్యుమరేటర్లుగా పనిచేయనున్న మొత్తం 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు/ఉపాధ్యాయులకు దేశమంతా శిక్షణ ఇవ్వడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది.

ఇదిలావుండగా ఎన్నికల సంఘం తదుపరి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టనున్నది. అంటే ఓటర్ జాబితా సవరణ, సమీక్ష వంటివి చేయనున్నది. ఈ నేపథ్యంలో జనాభా గణనకు అంతగా సమయం లేదనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల అనంతరమే జనాభా గణన జరుగనున్నట్లు తెలుస్తోంది. స్వీయ గణన ప్రక్రియలో ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పనిసరిగా సేకరించబడుతుంది. జనాభా గణనలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం ప్రకారం, పౌరులను 31 ప్రశ్నలు అడుగుతారు.

ఇవి కుటుంబానికి టెలిఫోన్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేక స్మార్ట్ ఫోన్, సైకిలు, స్కూటర్ లేక మోటారు సైకిలు లేక మోపెడ్ ఉందా, కారు, జీపు, వ్యాన్ ఉన్నాయా వంటివి అడుగుతారు. ఇంటో ఏ తృణ ధాన్యాలు తింటున్నారన్నది కూడా అడుగుతారు. ఇక త్రాగు నీరు, లైటింగ్ వనరులేమిటని అడుగుతారు. అలాగే స్నానం చేసే వసతి, వంటగది, ఎల్‌పిజి/పిఎన్‌జి కనెక్షన్, వండేందుకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, రేడియో, టెలివిజన్ తదితరాల గురించి అడుగుతారు.

జనాభా గణనలో గృహం నేల, గోడ,కప్పు ఎలాంటివని అడుగుతారు. కుటుంబంలో నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య గురించి అడుగుతారు. అలాగే ఇంటికి పెద్ద దిక్కు మహిళేనా అని అడుగుతారు. పైగా ఇంటి పెద్ద ఎస్సీ,ఎస్టీయా అని అడుగుతారు. ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఇంట్లో వివాహిత జంటలెంత మంది తదితరాల వివరాలు అడుగుతారు