“ఇది భవనం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ఆదివారం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తూ నవ భారత ఆకాంక్షలకు ఇది ప్రతిబింబమని చెప్పారు. తొలుత పార్లమెంటులో చారిత్రక రాజదండం సెంగోల్ ను ప్రధాని ప్రతిష్టాపన చేశారు.
నూతన పార్లమెంటు భవనంలో తన తొలి ప్రసంగం చేస్తూ ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత దేశమే పునాదిగా ఉందని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృమూర్తి అని చెబుతూ “ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్. ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాదిగా కూడా ఉంది. ప్రజాస్వామ్యమే మన సంస్కారం, ఆలోచన, సంప్రదాయం” అని తెలిపారు.
భారత్ సుస్థిరమైన అంకితభావంతో ఉందని ఈ భవనం ప్రపంచానికి సందేశం పంపుతుందని పేర్కొంటూ పార్లమెంటు నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్‍కు నిదర్శనంగా, శాసనంగా ఉంటుందని ప్రధాన మంత్రి తెలిపారు. “ఆత్మనిర్భర్ భారత్‍కు కొత్త పార్లమెంటు భవనం శాసనంగా ఉంటుంది. వికసిత భారతం దిశగా మన ప్రయాణానికి సాక్షిగా ఉంటుంది” అని ప్రధాని ప్రకటించారు.
భారత్‍తో పాటు ప్రపంచ అభివృద్ధికి కూడా ఈ పార్లమెంటు కొత్త భవనం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఏక్ భారత్.. ఏక్ శ్రేష్ఠ భారత్‍ను ఈ భవనం ప్రతిబింబిస్తోందని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పారు. కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయామని చెబుతూ స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నామని ప్రధాని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు.
పార్లమెంటు నూతన భవనంలో సెంగోల్ ప్రతిష్టాపన గురించి ప్రస్తావిస్తూ “చోళ రాజవంశంలో న్యాయం, ధర్మం, సుపరిపాలనకు సెంగోల్ ప్రతీక. చారిత్రక సెంగోల్ గౌరవాన్ని పునరుద్ధరించడం మన అదృష్టం. ఈ సభలో కార్యాకలాపాలు జరిగినప్పుడల్లా సెంగోల్ మనకు స్ఫూర్తినిస్తుంది” అని మోదీ తెలిపారు.
త్వరలో పార్లమెంటులో ఎంపీల సంఖ్య పెరగనుందని, అందుకే నూతన భవనం అవసరం అయిందని ప్రధాన మంత్రి చెప్పారు. అందుకు తగ్గట్లుగానే అధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించామని చెబుతూ ప్రస్తుత పార్లమెంట్ కు 1272 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మించామని వెల్లడించారు. పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే కాకుండా సాకేంతికంగానూ ఇబ్బంది ఉండేదని ప్రధాని తెలిపారు.
“కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. రానున్న సమయంలో సీట్ల సంఖ్య, ఎంపీల సంఖ్య పెరగనుంది. ఆ అవసరం కోసమే కొత్త పార్లమెంటు నిర్మాణం అవసరమైంది” అని మోదీ తెలిపారు. పార్లమెంటు కొత్త భవన నిర్మాణంలో 60వేల మంది పాల్గొన్నారని, వారి కోసం ప్రత్యేకంగా ఓ డిజిటల్ గ్యాలరీని కూడా నిర్మించినట్టు మోదీ తెలిపారు. పార్లమెంటు నూతన భవన ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణేన్ని ఆవిష్కరించారు.
ఆదివారం ఉదయం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్వర్వ మతాల ప్రార్థనలు జరిగాయి. అనంతరం పార్లమెంటులో స్పీకర్ సీటు సమీపంలో సెంగోల్‍ను మోదీ ప్రతిష్టించారు. మధ్యాహ్నం పార్లమెంటులోకి మోదీ అడుగుపెట్టారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన వారు నిలబడి “మోదీ.. మోదీ” అంటూ నినదించారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు