కోట్లాది హృదయాల్లో ఎన్‌టీఆర్‌కు సుస్థిర స్థానం

బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారుని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
 
ఎన్‌టీఆర్ సినిమాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను పోషించి, కోట్లాది మంది మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. మోదీ ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం  ‘మన్ కీ బాత్’ 101వ ఎపిసోడ్‌‌లో మాట్లాడుతూ ఈ రోజు ఎన్‌టీఆర్ శతజయంతి కావడంతో అయన సేవలను ప్రస్తావించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్‌టీఆర్ చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు.
 
తన నటన ఆధారంగా అనేక చారిత్రక పాత్రలకు జీవం పోశారని, భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్ నటనని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారని ప్రధాని గుర్తు చేశారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారని వివరించారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
 

బహుముఖ ప్రతిభతో ఆయన సినీ రంగంలో పేరు, ప్రతిష్ఠలు సంపాదించారని తెలిపారు. 300కుపైగా చిత్రాల్లో నటించి అలరించారని తెలిపారు. ప్రజల నుండి ప్రేమ, ఆశీర్వాదాలు పొందారని చెబుతూ  దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాది ప్రజల హృదయాలను ఏలిన ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

మరో వైపు వీర సావర్కర్ సేవల గురించి మోదీ  ప్రస్తావించారు. స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు సామాజిక సమానత్వం కోసం సావర్కర్ చేసిన సేవలు నేటికి గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమం గురించి ప్రధాని మోదీ  ప్రస్తావించారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వినేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిని చూపిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. న్యూజిలాండ్ లో వందేళ్ల వృద్దురాలు తన ఫొటోను ఆశీర్వదించారని గుర్తు చేసారు.  దేశ వ్యాప్తంగా ప్రజల నుండి నిర్మాణాత్మక సూచనలు, సలహలు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వచ్చిన విషయాన్ని ప్రధాని వివరించారు.
గత పదేళ్లలో భారతదేశంలో కొత్త మ్యూజియాలు, స్మారక చిహ్నాలను నిర్మించిన విషయాన్ని ప్రదాని గుర్తు చేశారు.  స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పోరాటాలను వివరించే పది కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రధాని వివరించారు. గురుగ్రామ్ లో ఉన్న మ్యూజియంలో కెమెరాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
 
ఇండియన్ మెమరీ ప్రాజెక్టు 2010లో స్థాపించారని మోదీ గుర్తు చేశారు. ఇది ఒక రకమైన ఆన్ లైన్ మ్యూజియంగా ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు మ్యూజియంల గురించి ప్రధాని ప్రస్తావించారు.