రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి

రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం ప్రగతి మైదానంలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో  ‘వికసిత్‌ భారత్‌ ఏ 2047’ అనే థీమ్‌ తో నిర్వహించిన  నీతి ఆయోగ్‌ పాలక మండలి ఎనిమిదో  సమావేశంకు అధ్యక్షత వహిస్తూ కేవలం జాతీయ స్థాయిలోతీసుకునే నిర్ణయాల వల్లనే ప్రగతి సాధ్యంకాదని ప్రధాని తెలిపారు. 

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల వృద్ధి వంటి ఎనిమిది అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సోరెన్‌, కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల సిఎంలు భూపేష్‌ భఘేల్‌, సుఖ్వేంధర్‌ సుక్‌, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవరుర్లు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, పియూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నారాయణ్‌ రాణె, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ  మాట్లాడుతూ 2047లో వికసిత్‌ భారత్‌ను సాధించేందుకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీమ్‌ ఇండియాగా కలిసి పనిచేయాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాన భాగస్వామ్యానికి నీతి ఆయోగ్‌ ఒక వేదికను అందిస్తుందని, తద్వారా దేశంలో సహకార, పోటీ సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు.

నీతి ఆయోగ్‌లో ఇప్పుడు వికసిత్ భారత్ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం చాలా కీలకమైనదని ప్రధాని చెప్పారు. భారత్‌ను 2047 నాటికి ప్రపంచ స్థాయిలో సంపన్న దేశంగా మల్చుకోవల్సి ఉంటుందని చెబుతూ దీనిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలు, జిల్లాలు దీర్ఘకాలిక ప్రణాళికలు, కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని సూచించారు.

కోఆపరేటివ్‌ ఫెడరలిజంను బలోపేతం చేసేందుకు నీతి ఆయోగ్‌ ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం (ఎడిపి) వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎడిపిలో చురుగ్గా పాల్గనుందుకు రాష్ట్రాలను అభినందించారు. ఎడిపి విజయవంతం కావడంతో నీతి ఆయోగ్‌ ఆకాంక్షాత్మక బ్లాక్‌ (ఎబిపి)ల కార్యక్రమానిు ప్రారంభిస్తోందని తెలిపారు.

రాష్ట్రాల్లో 500 వెనుకబడిన బ్లాకుల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారిని రాష్ట్ర సగటుతో సమానంగా తీసుకురావడం ఎబిపి లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ మిల్లెట్‌ సంవత్సరంలో భాగంగా మిల్లెట్‌ కార్యక్రమంలో రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. శ్రీ అను అనేది పర్యావరణ అనుకూల పంట, రైతుకు అనుకూలమైన ఒక సూపర్‌ ఫుడ్‌ అని పేర్కొన్నారు.

చమురు ఉత్పత్తిలో ఆత్మనిర్భర్‌గా మారాలని చెబుతూ రాష్ట్రాలు 50 వేల పైబడి అమృత్‌ సరోవర్లను నిర్మించడాన్ని ప్రధాని ప్రశంసించారు. జల సంరక్షణ కోసం విలువైన ఆస్తులను సృష్టించి, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తునుందున ఈ మిషన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా మారేందుకు, ప్రజల కలలను నెరవేర్చే కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మోదీ కోరారు.

  • పది రాష్ట్రాల సిఎంలు గైర్హాజరు

నీతి ఆయోగ్‌ సమావేశానికి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌ రావు (తెలంగాణ), నితీష్‌ కుమార్‌ (బీహార్‌), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), సిద్ధరామయ్య (కర్ణాటక), పినరయి విజయన్‌ (కేరళ), నవీన్‌ పటాుయక్‌ (ఒరిస్సా), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), అశోక్‌ గెహ్లాట్‌ (రాజస్థాన్‌), ఎంకె స్టాలిన్‌ (తమిళనాడు), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌) గైర్హాజరయ్యారు.