ఆధీనమ్‌ల ఆశీర్వాదాలతో రాజదండాన్ని స్వీకరించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు నుంచి వచ్చిన ఆధీనమ్‌ల (మఠాధిపతులు) నుంచి అత్యంత పవిత్రమైన రాజదండాన్ని స్వీకరించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు మోదీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆధీనమ్‌లు ఆయనను ఆశీర్వదించి, ఈ రాజదండాన్ని ఆయనకు అందజేశారు.
 
తమిళనాడులోని ధర్మపురం, పళని, విరుధాచలం, తిరుకోయిలూర్, తిరువవడుతురైల నుంచి దాదాపు 21 మంది మఠాధిపతులు (ఆధీనమ్‌లు) శనివారం అందుకోసం న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మదురై అధీనం 293వ ప్రధాన పూజారి ప్రధాని మోదీకి సెంగోల్‌ను బహుకరించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీకర్ సీటు దగ్గర ‘సెంగోల్’ (రాజదండం) ఉంచుతారు.
14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. దీనిని బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి  చిహ్నంగా అభివర్ణించారు.  బ్రిటిషర్ల నుంచి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నం ఈ రాజదండం (సెంగోల్) అని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు పరుగులు తీస్తున్న అమృతకాలంలో దీనిని జాతీయ చిహ్నంగా చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణయించారు.

ఈ రాజదండం ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నం. తిరువవడుతురై ఆధీనానికి చెందిన అంబలవన దేసిగ పరమాచార్య స్వామిగళ్ శుక్రవారం మాట్లాడుతూ, సెంగోల్‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తుండటం తమిళనాడుకు గర్వకారణమని చెప్పారు. 1947లో లార్డ్ మౌంట్‌బాటన్ ఈ సెంగోల్‌ను జవహర్లాల్ నెహ్రూకు అందజేశారని పేర్కొన్నారు. దీనిని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని మోదీ నిర్ణయించడం హర్షణీయమని, గర్వకారణమని తెలిపారు.

చారిత్రక రాజదండానికి దీనిని ముందుగా స్వీకరించిన వారు సముచిత గౌరవం ఇచ్చి ఉన్నట్లు అయితే బాగుండేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. . దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దీనిని అలహాబాద్‌లోని నెహ్రూజీ కుటుంబానికి చెందిన ఆనంద్‌భవన్‌లో ఓ కర్ర తరహాలో ప్రదర్శనకు ఉంచారని తనకు తెలిసిందని, దీనిని గుర్తించి తమ ప్రభుత్వం దీనిని అక్కడి నుంచి తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు.

తమిళనాడుకు చెందిన దాదాపు 60 మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఓ క్రతువు మాదిరిగా ఈ దండాన్ని ప్రధాని అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ  సెంగోల్‌ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు,  పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది. తమిళనాడులోని మఠాలు లేదా అధీనంలకు ప్రత్యేకత ఉంది. ఇవి అగ్రవర్ణాల ఆధిక్యతను ప్రతిఘటించాయని, మతాన్ని సామాన్య జనం వద్దకు , అంటరాని వారి వద్దకు తీసుకువెళ్లే క్రమంలో ముందుకు సాగాయని చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చిన వారిలో అత్యధికులు శతాధికులే.