`నీతి ఆయోగ్’ కు 9 మంది సీఎంల డుమ్మాపై బిజెపి ఆగ్రహం!

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉండడం పట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గైర్హాజరయ్యారు.

పైగా, ఈ సమావేశాన్ని బహిష్కరించిన ఆప్ కు చెందిన ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్  హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో భేటీ జరిపారు. ఢిల్లీ పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు.

సీఎంలు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని బిజెపి విమర్శించింది.  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్యం, స్కిల్ డవలప్‌మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ  సమావేశం జరిగింది.

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం గైర్హాజరీకి సంబంధించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కారణాలు చెప్పారు. దిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, బదిలీల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ చెప్పారు.

నీతి ఆయోగ్‌ సమావేశానికి తాను రాలేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే బెంగాల్ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని పంపించేందుకు అనుమతినివ్వాలని దీదీ సర్కార్ విజ్ఞప్తి చేసింది . అయితే ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశానికి రాలేకపోతున్నామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.
అనారోగ్య కారణాల వల్ల నీతి ఆయోగ్‌ సమావేశానికి రావడం లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. సింగపూర్‌, జపాన్‌ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.  కర్ణాటకలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ శనివారం కేబినెట్‌ విస్తరణ చేపట్టడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశానికి రాలేకపోయారు. ఇక ఈ భేటీకి రాలేనని ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

సమావేశానంతరం మీడియాతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.

 అయితే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకాలేదని పేర్కొంటూ ఇంత పెద్ద సంఖ్యలో సీఎంలు హాజరుకాకుంటే, తమ రాష్ట్ర ప్రజల వాణిని వారు ఎలా వినిపించగలుగుతారని ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని, బాధ్యతారాహిత్యమైన, ప్రజావ్యతిరేక చర్య అని తప్పుపట్టారు.  “నరేంద్ర మోదీని ఎంతకాలం ఇలా వ్యతిరేకిస్తూ వస్తారు?” అని ఆయన నిలదీశారు. ప్రధాని మోదీతో విభేదించేందుకు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ మీ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు హాని చేయాలనుకుంటున్నారు?” అంటూ  నీతి ఆయోగ్‌కు గైర్హాజరైన సీఎంలను ఉద్దేశించి ప్రశ్నించారు.