దమ్ముంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించండి

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపుగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భజరంగ్ దళ్‌లను నిషేధిస్తామంటూ కొందరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక కేబినెట్ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన హెచ్చరికలపై మండి పడుతున్నారు.

దమ్ముంటే నిషేధించాలని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్ అశోక కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. దమ్ముంటే ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఒక్క శాఖనైనా నిషేధించి చూపించండి అంటూ ఆయన సవాల్ చేశారు. “మీ నాన్న ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించలేకపోయారు. మీ అమ్మమ్మ చేసింది కాదు. మీ ముత్తాత కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మీరేం చేయగలరు?” అంటూ ప్రియాంక ఖర్గే ను నిలదీశారు.

పార్లమెంటులో కాంగ్రెస్‌కు ఒకప్పుడు మెజారిటీ ఉండేదని ఆయన గుర్తు చేశారు. ‘‘దేశంలో కాంగ్రెస్ కు 15-20 రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేవి. అప్పుడే ఏమీ చేయలేక పోయారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది” అంటూ ఎద్దేవా చేశారు.

“దమ్ముంటే ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి. మీ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు. మూడు నెలలు కూడా లక్షల శాఖల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. ఒక శాఖపై అయినా నిషేధం విధించి చూపించండి” అని అశోక సవాలు విసిరారు. హిందూవుల మనోభావాలు  భావాలు ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌లతో ముడిపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌనంగా ఉంటున్నారని, ప్రతి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతున్నారని అశోక్ ఎద్దేవా చేశారు. ప్రతి  సమావేశంలో పోలీసులను, హిందువులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

కాగా, బజరంగ్‌దళ్‌ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని బిజెపి కర్ణాటక అధ్యక్షుడు  నళిన్‌ కటీల్‌ హెచ్చరించారు.  ‘ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్.  ఆయన కేంద్ర స్థానంలో ఉన్నారు. మేమంతా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులం. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నించాయి. దానిలో విజయం సాధించలేకపోయింది’’ అని కర్ణాటక పేర్కొన్నారు.