జైలు బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయిన సత్యేంద్ర జైన్

మనీలాండరింగ్ కేసులో జైలులో గడుపుతున్న  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం రోజున తీహార్ జైలులోని బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయారు.  దీంతో ఆయనను వెంటనే  దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. 

తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం  జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్  ఉదయం 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయారని తెలిపారు.  దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహింస్తున్నట్లుగా తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు. 

బాత్‌రూమ్‌లో పడి వెన్నెముకకు గాయమై  సత్యేంద్ర జైన్ ఆస్పత్రిలో చేరడం వారంలో ఇది రెండోసారి.  జైన్‌కు అనారోగ్య కారణంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి ఈ నెల 22న తీసుకెళ్లారు.  జైలులో ఒంటరితనం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నారని ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క‌స్టడీలో స‌త్యేంద‌ర్ జైన్ ఏకంగా 35 కిలోల బ‌రువు త‌గ్గార‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు.

కాగా సత్యేంద్ర జైన్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది.  ఆ ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఈడీ దర్యాప్తు  మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్ర జైన్ ను గత ఏడాది మే ౩౦వ తేదీన ఈడీ  అరెస్ట్ చేసింది.