హిజాబ్ పై నిషేధం ఎత్తివేయనున్న కర్ణాటక!

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
 
ఈ విషయంలో ఈ క్రమంలో మంత్రి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడుతూ తిరోగమించేలా ఉన్న ప్రతి ఉత్తర్వులు, బిల్లును సమీక్షిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తి హక్కులను ఉల్లంఘించే, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులన్నింటినీ సమీక్షిస్తామని, అవసరమైతే తిరస్కరించనున్నట్లు వెల్లడించారు.
‘రాజ్యాంగ విరుద్ధమైన, వ్యక్తి హక్కులను ఉల్లంఘించే, రాష్ట్ర ప్రతిష్ట, పెట్టుబడి, ఉపాధిని ప్రభావితం చేసే చట్టాన్ని సమీక్షించడంలో మా ప్రభుత్వం దృఢంగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా సమానమైన కర్ణాటకను నిర్మించాలనుకుంటున్నాం. హిజాబ్ సర్క్యులర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి 18,000 మంది మైనారిటీ విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉన్నారు. వారు ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని, విద్యను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం’ మంత్రి చెప్పారు.

భజరంగ్‌దళ్‌ను సైతం నిషేధించాలనే చర్చ జరిగిందని చెబుతూమతపరమైన, రాజకీయంగా, సామాజికంగా ఏదైనా సంస్థ సమాజంలో విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని సహించేది లేదని తెలిపారు.  అలాంటి సంస్థలతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పారు. అది భజరంగ్‌దళ్‌ అయినా, పీఎఫ్‌ఐ అయినా, మరే సంస్థ అయినా కఠినంగా ఉంటామని, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తే నిషేధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

‘కర్నాటకను స్వర్గంగా మలుస్తామని మేమ మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము. ఒకవేళ శాంతికి విఘాతం కలిగితే, మేము బజరంగ్ దళా లేక మరో సంఘ్‌పరివార్ సంస్థనా అని చూడం’ అని చెప్పారు. `చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా సరే, అది ఆర్‌ఎస్‌ఎస్ కావొచ్చు, మరోకటి కావొచ్చు.. తాము చట్టపరంగా చర్య తీసుకుంటాము’ అని వివరించారు.

గత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన గోవధ నిషేధం, మత మార్పిడి నిరోధక చట్టాలతో సహా హిజాబ్, పాఠ్యపుస్తకాల సవరణ తదితర వాటిని మేం సమీక్షిస్తాం.. ఈ చట్టాలలో ఏదైనా వివాదాస్పదంగా, మతపరమైన లేదా సామాజిక ఆకృతికి లేదా రాష్ట్ర ప్రతిష్టకు విరుద్ధంగా ఉన్నట్లు మేము గుర్తిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని ప్రియాంక్ ఖర్గ్ తెలిపారు.

గతేడాది బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఒకే డ్రెస్ కోడ్‌ను పాఠశాలలు, కళాశాలల్లో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.