యుద్ధ నౌక విక్రాంత్ పై మిగ్ 29 కె రాత్రి ల్యాండింగ్
మే 25, 2023 1 min read
భారత నౌకాదళం మరో ఘనతను సాధించింది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మిగ్-29కే నైట్ ల్యాండింగ్ విజయవంతమైంది. ఈ విషయాన్ని నావికాదళం గురువారం ప్రకటించింది. మిగ్-29కే మొదటిసారిగా రాత్రి సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండింగ్ చేపట్టి నేవి మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది.
ఇది ఆత్మనిర్భర్ భారత్ పట్ల నౌకాదళం ప్రోత్సాహాన్ని సూచిస్తుంది’ అంటూ నేవీ ట్వీట్ చేసింది. సవాల్‌తో కూడిన నైట్ ల్యాండింగ్‌లో విక్రాంత్ సిబ్బంది, నౌకాదళ పైలట్ల సంకల్పం, నైపుణ్యాన్ని ప్రదర్శించారని, వారిని అభినందించాల్సిందేనని పేర్కొంది. ల్యాడింగ్ విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగస్వాములైన సిబ్బంది, అధికారులను ఆయన ప్రశంసించారు.
ఇంతకు ముందు మార్చి 28న కమోవ్ 31 హెలికాప్టర్ సైతం ఐఎన్ఎస్ విక్రాంత్‌పై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. టెస్టింగ్ సమయంలో స్వదేశీ లైటింగ్ ఎక్విప్‌మెంట్స్, షిప్‌బోర్న్ సిస్టమ్స్‌ను వినియోగించగా.. విజయవంతమైందని అధికారులు పేర్కొన్నారు.ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు. దీనికి పొడవు 262 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 62 మీటర్లు. 59 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇది భారతదేశ తొలి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక, ఇందులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను ‘కదిలే నగరం’గా, ‘బాహుబలి నౌక’గా పేర్కొంటారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ బరువు దాదాపు 40వేల టన్నులు. ఈ యుద్ధనౌకలో 14 డెక్‌లు, 2300 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. 1700 మంది సిబ్బందికి వసతి ఉంటుంది. ఇందులో మహిళా అధికారుల కోసం ప్రత్యేక క్యాబిన్లు సైతం ఉన్నారు. అలాగే ఐసీయూ నుంచి వైద్య సంబంధిత సేవలు, శాస్త్రీయ ప్రయోగశాలలు సైతం ఏర్పాటు చేశారు.
ఈ యుద్ధ నౌక గరిష్ఠంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ వేగం 18 నాట్స్. అంటే 33 కిలోమీటర్లు. ఈ వాహక నౌక ఒకేసారి 7500 నాటికల్ మైళ్లు అంటే.. 13వేల కిలోమీటర్లపైగా దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది.
ఒకేసారి 30 విమానాలను తీసుకువెళ్తుంది. వీటిలో మిగ్-29కె ఫైటర్ జెట్‌లతో పాటు కామోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్ -60ఆర్ సీహాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు, హెచ్ఎఎల్ తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు వంటి ఉన్నాయి. నేవీ కోసం భారత్‌లో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ఎల్ సి ఎ తేజస్ సైతం ఈ వాహక నౌక నుంచి సులభంగా టేకాఫ్ చేయవచ్చు.
More Stories
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగాళ్లకే
ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు