మణిపూర్‌లో మరోసారి హింస.. ఒకరి మృతి

మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం బిష్ణుపూర్‌లోని ఆ రాష్ట్ర మంత్రి కొంతౌజమ్‌ గోవిందాస్‌ ఇంటిపై ఒక వర్గానికి చెందిన ప్రజలు దాడి చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలల్లో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు మూడు ఇళ్లను తగుల పెట్టారు. మొయిరాంగ్‌లో సమీపంలోని పలు గ్రామాలపై సాయుధ యువకులు బుధవారం తెల్లవారు జామున దాడులకు తెగబడ్డారు.
మిలిటెంట్ల నుంచి తమను కాపాడేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఒక సామాజిక తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని తుపాకీలతో కాల్పులు జరిపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఒకరు మరణించారు.  బుధవారం నాటి ఘర్షణల నేపథ్యంలో బిష్ణుపూర్‌, ఇంఫాల్‌ తూర్పు, ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను పునరుద్ధరించారు.
 
మంగళవారం ఇదే జిల్లాలోని ఫౌబక్చావో వద్ద నాలుగు ఇళ్లను దగ్ధం చేయగా..ఆ ఘటనకు ప్రతీకారంగానే బుధవారం దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి మణిపూర్‌లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. నిరవధిక కర్ఫ్యూ విధించినప్పటికీ, సైన్యం, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది పహారా కాస్తున్నా.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు.
 
గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో జనజీవనం స్తంభించి పోవడంతో  నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.170 ఉండగ, సిలిండర్‌ ధర ఏకంగా రూ.1800 దాటడంతో మణిపూర్ వాసులు అల్లాడిపోతున్నారు. అల్లర్ల దృష్ట్యా మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ముందుకు రాకపోవడంతో సరఫరా నిలిచిపోయింది.
 
దీంతో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. ఘర్షణలు జరుగుతున్న ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ లోయ సహా పలు ప్రాంతాల్లో బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10కి చేరగా, కిలో బంగాళదుంపల ధర రూ.100 కు పెరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. రాజధాని ఇంఫాల్‌లోని చాలా చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.170 ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
మణిపూర్‌లోని మెయితీ, కుకీ తెగల మధ్య మే 3 న తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 70 మందికి పైగా మృతిచెందారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. ఇటీవల పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపించినా.. గత సోమవారం నుంచి మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. దీంతో మరోసారి ఆంక్షలు విధించి.. కేంద్ర బలగాలను మోహరించారు.